ఊర్వశి రాక్షసివో తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న అల్లు శిరీష్ వచ్చే నెల ఆగస్ట్ 2న బడ్డీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. కోలీవుడ్ సంస్థ స్టూడియో గ్రీన్ దీని మీద గట్టిగానే ఖర్చు పెట్టడమే కాక ప్రమోషన్లు కూడా ఎడతెరిపి లేకుండా చేస్తోంది. శిరీష్ అంతా తానై ఇంటర్వ్యూలు, ఈవెంట్లు దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఒక రోజు ముందు ప్రీమియర్లే రిస్క్ అనుకుంటే ఏకంగా పది రోజుల ముందే విజయవాడ, వైజాగ్ లో స్పెషల్ షోలు వేయడం చూస్తే టీమ్ నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలను టార్గెట్ చేసిన అంశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి.
శిరీష్ కు ఇది హిట్ కావడం చాలా కీలకం. ఎందుకంటే కెరీర్ మొదలుపెట్టి ఇన్ని సంవత్సరాలైనా సాలిడ్ గా ఒక బ్లాక్ బస్టర్ పడలేదు. శ్రీరస్తు శుభమస్తు బాగానే వర్కౌట్ అయినా అది కూడా వరసబెట్టి ఆఫర్లను తీసుకొచ్చింది కాదు. ఒకపక్క అన్నయ్య అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా పుష్పతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. తను కూడా ఒకటి రెండు హిట్లు కొడితే కెరీర్ ని క్రమంగా సెటిల్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే సూర్య, కార్తీలాగా ఉండాలనేది తన కోరిక. కాకపోతే కంటెంట్ సరిగా పడక కుర్రాడి అవస్థలు కొనసాగుతున్నాయి. మరి బడ్డీ ఆ లోటుని తీరుస్తుందేమో చూడాలి.
ఇక సినిమా విషయానికి వస్తే బడ్డీ ఒక టెడ్డి బేర్ చుట్టూ జరిగే కథ. విలన్ అజ్మల్ చేసే విధ్వంసాన్ని శిరీష్ ఆ బొమ్మతో కలిసి ఎలా కట్టడి చేశాడనే పాయింట్ మీద రూపొందింది. సామ్ అంటోన్ దర్శకత్వం వహించగా హిప్ హాప్ తమిజా సంగీతం సమకూర్చాడు. పోటీ తీవ్రంగా ఏమి లేదు కాబట్టి టాక్ కనక పాజిటివ్ గా వస్తే ఆగస్ట్ 15 దాకా బాక్సాఫీస్ వద్ద మంచి ఛాన్స్ ఉంటుంది.దీనికైన బిజినెస్ కి రెండు వారాల గ్యాప్ సరిపోతుంది కనక బ్రేక్ ఈవెన్ దాటేసుకోవచ్చు. మరి ఇంతగా కష్టపడుతున్న శిరిష్ కి వచ్చే వారం రిలీజవుతున్న బడ్డీ ఎలాంటి ఫలితం ఇస్తుందో వేచి చూడాలి.