పెద్ద అంచనాలు లేకుండా జూలై 5 విడుదలైన బాలీవుడ్ మూవీ కిల్ ఊహించని స్థాయిలో స్పందన దక్కించుకుంది. దానికైన బడ్జెట్ ప్రకారం భారీ లాభాలను తీసుకొచ్చింది. ఏకంగా హాలీవుడ్ నుంచి రీమేక్ రైట్స్ కోసం ఆఫర్లు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు రీచ్ ఏ స్థాయిలో ఉందో. అఫ్కోర్స్ అమ్మేశారు అది వేరే విషయం.
ఇంకా థియేటర్లలో ఆడుతున్న కిల్ హఠాత్తుగా ఓటిటిలో ప్రత్యక్షమైపోయింది. అయితే ట్విస్ట్ ఏంటంటే ఇండియన్ ప్రేక్షకుల కోసం కాదు. యుఎస్ ఆడియన్స్ 24 డాలర్లకు అల్ట్రా హెచ్డి వెర్షన్ ని అద్దెకు చూసే విధంగా ప్రైమ్ అక్కడ మాత్రమే అందుబాటులోకి తెచ్చింది.
మనకేం సమస్య అనుకోవడానికి లేదు. ఎందుకంటే పైరసీ వీరులు యాక్టివేట్ అయిపోయి ఈ కిల్ ని తమ సైట్లలో పెట్టేశారు. అంటే డబ్బులిచ్చి కొన్న ప్రైమ్ యాప్ లో ఇది లేకపోయినా అనధికారికంగా వివిధ రూపాల్లో ఆన్ లైన్ ద్వారా చూసేయొచ్చన్న మాట. నిజానికి ఈ స్ట్రాటజీ తప్పు.
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ సరళతరం అయ్యాక అంతే స్థాయిలో పైరసీ భూతాలు పెట్రేగిపోతున్నాయి. అలాంటప్పుడు కిల్ లాంటి మూవీని చూస్తూ వదిలేస్తారా. ఆ మధ్య మంకీ మ్యాన్ మన దేశంలో థియేట్రికల్ రిలీజ్ కాకుండానే బయట దేశాల్లో ఓటిటికి ఇచ్చారు. ఎంచక్కా మనవాళ్ళు పైరసీలో చూసేశారు.
దీంతో మంకీ మ్యాన్ ఇక్కడి స్క్రీన్ల మీదకు రాకుండానే సెలవు తీసుకుంది. భవిష్యత్తులో కిల్ ని మన ప్రైమ్ లోనూ వదులుతారు. నిజమే. కానీ వరల్డ్ వైడ్ ఒకే సమయంలో స్ట్రీమింగ్ చేస్తేనే సదరు ఓటిటిలకు, నిర్మాతలకు లాభం కలుగుతుంది.
సైబర్ చట్టాలు బలంగా లేని దేశాల్లో పైరసీని ఎవరూ కట్టడి చేయలేకపోతున్నారు. విదేశీ సర్వర్ల నుంచి ఆపరేట్ చేస్తున్న ముఠాలు విచ్చలవిడిగా థియేటర్, ఓటిటి కంటెంట్ ని ఉచితంగా పంచి పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక్కోచోట ఒక్కోలా డిజిటల్ రిలీజ్ పెట్టుకుంటే ఇలాంటి సమస్యలే వస్తాయి. ఇప్పటికైనా ఇలాంటి నష్టాలను గుర్తించాలి.