తమిళ కథానాయకుడు ధనుష్ ఇప్పుడు ఇండియా మొత్తంలో టాప్ స్టార్లలో ఒకడు. అతనెంత గొప్ప నటుడో కేవలం తమిళులే కాదు.. సౌత్, నార్త్ అని తేడా లేకుండా అందరూ చెబుతారు. తెలుగులో, హిందీలో కూడా తన సినిమా వస్తోందంటే ఆసక్తిగా చూస్తారు. ఐతే ఇప్పుడు అతనున్న స్థాయి చూసి ఒకసారి తన కెరీర్ ఎలా ఆరంభమైందో చూసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు.
‘తుల్లువదో ఎలమై’ అనే చిన్న సినిమాలో హీరో కాని హీరోగా తన ప్రస్థానం మొదలైంది. కేవలం తన ప్రతిభతోనే అతనీ స్థాయిని అందుకున్నాడు. కేవలం నటుడిగానే కాక గాయకుడిగా, గేయ రచయితగా, కథా రచయితగా, దర్శకుడిగా తన బహుముఖ ప్రజ్ఞను అతను చాటుకున్నాడు. తన ప్రతిభ, తపన ప్రకాష్ రాజ్ లాంటి లెజెండరీ నటుడిని సైతం అబ్బుర పరచడం విశేషం. ధనుష్ తనే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాయన్’ తెలుగు ప్రి రిలీజ్ ఈవెంట్లో ప్రకాష్ రాజ్.. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి గొప్పగా మాట్లాడాడు.
“ధనుష్ తపన, కష్టం చూస్తే నాకు ముచ్చటేస్తుంది. అతను రాయన్ లాంటి పెద్ద సినిమా తీశాడు. ఇప్పుడు అది కాక చిన్న ఆర్టిస్టులతో ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంకోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడు. ఇన్ని సినిమాలతో బిజీగా ఉంటూ.. నాకు ఈ మధ్యే ఒక మంచి కథ చెప్పాడు. నన్ను, నిత్యా మీనన్‌ను పెట్టి ఆ సినిమా తీయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఒక వ్యక్తికి సినిమా అంటే ప్రేమ ఉంటే ఎంతైనా చేస్తాడు అనడానికి ఇది ఉదాహరణ. ఇదంతా చూస్తే నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపించింది” అని ప్రకాష్ రాజ్ చెప్పాడు.
ఎందరో దిగ్గజాలతో కలిసి పని చేయడమే కాక.. తానూ ఒక దిగ్గజంగా ఎదిగిన ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి ధనుష్ గురించి ఇంత గొప్పగా మాట్లాడ్డం చిన్న విషయం కాదు. నిజంగా ధనుష్ ప్రతిభ, తన కష్టం, తపన చూస్తే ఎవ్వరికైనా ముచ్చటేస్తుందనడంలో సందేహం లేదు.