నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో మురారి హిట్టా ఫ్లాపా అనే దాని గురించి పెద్ద డిబేటే నడుస్తోంది. 2001లో రిలీజైన ఈ ఫ్యామిలీ డ్రామాకు కల్ట్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కుటుంబ భావోద్వేగాలను దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన తీరు, మర్చిపోలేని మణిశర్మ అద్భుతమైన పాటలు వెరసి దాన్నొక ఆణిముత్యంగా మార్చేశాయి. ఓసారి ఫ్లాష్ బ్యాక్ లోకి తొంగి చూసి మురారి నిజంగా ఫ్లాపాని అడిగితే ఫ్యాన్స్ సంగతేమో కానీ అప్పట్లో థియేటర్ ఎక్స్ పీరియన్స్, జనాల స్పందన గుర్తున్నవాళ్ళు ఖచ్చితంగా కాదు అనే అంటారు. ఎందుకంటే బొమ్మ ఆడింది కాబట్టి.
హైదరాబాద్ తో కలిపి మొత్తం 3 కేంద్రాల్లో (మచిలీపట్నం, విజయవాడ) మురారి సిల్వర్ జూబ్లీ ఆడింది. రిలీజ్ టైంలో కృష్ణవంశీ స్వయంగా నిర్మాత రామలింగేశ్వరరావు దగ్గర తూర్పుగోదావరి జిల్లాల హక్కులను ఐదేళ్లకు 55 లక్షలకు కొంటే ఫస్ట్ రన్ లోనే 1 కోటి 30 లక్షలు తెచ్చి పెట్టింది. ఆపై రీ రిలీజుల్లోనూ లాభాలు దక్కాయి. మొదట్లో మూడు గంటలున్న నిడివి ఎక్కువయ్యిందంటూ డిస్ట్రిబ్యూటర్లు కొన్ని ఏరియాల్లో కొంత ఎడిట్ చేసి ప్రదర్శించిన మాట వాస్తవమే కానీ వారం పదిరోజుల తర్వాత మురారి క్రమంగా పికప్ అవుతూ ఫ్యామిలీ జనాలను బలంగా ఆకట్టుకుంది. హిట్టు స్టాంప్ వేయించుకుంది.
నిన్నే పెళ్లాడతా రేంజ్ లో ఫలితాన్ని ఊహిస్తే దానికన్నా తక్కువ యుఫోరియా అనిపించి ఉండొచ్చేమో కానీ మురారి ఏ కోణంలో చూసినా కాదనలేని క్లాసిక్. రీ రిలీజ్ ఆగస్ట్ 9 జరుగుతున్న నేపథ్యంలో అభిమానులు ఈ సంబంధించిన ముచ్చట్లతో ఎక్స్ ని నింపేస్తున్నారు. మరోవైపు కృష్ణవంశీ సైతం తన వంతుగా ఏమైనా అపద్దపు ప్రచారాలు ఉంటే వెంటనే ఆధారాలతో ఖండిస్తున్నారు. మురారి నేరుగా 77 సెంటర్లలో ఫిఫ్టీ డేస్, 26 సెంటర్లలో శతదినోత్సవం జరుపుకోవడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మరి ఏ లెక్కలో మురారిని ఫ్లాప్ అంటారనేదే మహేష్ బాబు ఫ్యాన్స్ సూటి ప్రశ్న.