దశాబ్దాల తరబడి తెరను ఏలిన అతి పెద్ద స్టార్లు సైతం కథల ఎంపికలో తాము చేసే పొరపాట్లకు ఎంత ఖరీదయిన మూల్యం చెల్లించాలో ఏడాది కాలంలో ముగ్గురు ఉదాహరణలుగా నిలిచారు. ముందుగా నిన్న సంవత్సరం ఆగస్ట్ లో వచ్చిన చిరంజీవి భోళా శంకర్ రిలీజ్ కు ముందే అంచనాల విషయంలో వెనుకబడిపోయి విడుదల రోజు సాయంత్రమే మెగాస్టార్ మూవీకి జనం లేరన్న అపఖ్యాతిని మూటగట్టుకుంది. మర్చిపోలేని గాయం మిగిల్చింది. చిరుకి ఫ్లాపులు కొత్త కాకపోయినా ఇదిచ్చిన కుదుపు దెబ్బకు ముందు ఓకే అనుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్టుని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది.
ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆనందంలో కూతురు ఐశ్వర్య మీద ప్రేమతో స్టోరీ ఏంటో చూసుకోకుండా లాల్ సలామ్ చేశారు. దీనికొచ్చిన నెగటివిటీ ఆయన కెరీర్లో డిజాస్టర్స్ గా చెప్పుకునే బాబా లాంటివి సైతం తెచ్చుకోలేదన్నది వాస్తవం. ఆఖరికి ఓటిటి హక్కులు కొన్న నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కి సైతం నోచుకోనంత దీనస్థితికి పడిపోయింది. ఫ్యాన్స్ అయితే దీన్ని మర్చిపోయారు. ఇప్పుడు కమల్ హాసన్ వంతు భారతీయుడు 2 రూపంలో వచ్చింది. ఆయన్ని నెత్తినబెట్టుకునే తమిళనాడులోనే మొదటివారం పట్టుమని యాభై కోట్లు వసూలు చేయనంత ఘోరంగా ఫ్లాప్ అయ్యింది.
ఇక్కడ చెప్పిన ముగ్గురు ఆరేడు పదుల వయసు దాటి కేవలం తమ నటతృష్ణని తీర్చుకోవడం, అభిమానులను సంతోషపెట్టడం కోసం సినిమాలు చేస్తున్నారు తప్పించి సంపాదన గురించి కాదు. ఇంకా చెప్పాలంటే యూత్ స్టార్లతో పోటీ పడుతూ ప్యాన్ ఇండియా ప్రాజెక్టులు చేసేందుకు ఉత్సాహపడుతున్నారు. విశ్వంభర, తగ్ లైఫ్, కూలి అలా ప్రత్యేకంగా ఎంచుకున్నవే. రిటైర్మెంట్ లేని నట జీవితంలో చివరి వరకు మేకప్ వేసుకుని సెట్లో కష్టపడుతూ ఉండాలనే ఈ లెజెండరీ హీరోల తగ్గించే చిత్రాలు రాకూడదంటే దర్శకులు స్క్రిప్ట్ ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ బ్లండర్స్ మళ్ళీ రిపీట్ కాకూడదు.