కల్కి × చిన్న సినిమాలు

గత కొన్ని వారాలుగా టాలీవుడ్లో ‘కల్కి 2898 ఏడీ’ తప్ప వేరే సినిమా పేరు వినిపించడం లేదు. జూన్ 27న ఈ చిత్రం విడుదల కాగా.. అంతకు కొన్ని రోజుల ముందు నుంచే కల్కి ఫీవర్ మొదలైపోయింది. ఇక రిలీజ్ తర్వాత ఈ చిత్రం ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే.

‘కల్కి’ వస్తోందని ముందు, వెనుక వారాల్లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ చేయలేదు. ఈ నెల 12న ‘భారతీయుడు-2’ మంచి అంచనాల మధ్యే విడుదలైనప్పటికీ అది అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమవడంతో మళ్లీ ‘కల్కి’నే బాక్సాఫీస్ దగ్గర లీడ్ తీసుకుంది. ఇక ఈ వారం విషయానికి వస్తే.. తెలుగు నుంచి కొన్ని చిన్న చిత్రాలు రిలీజవుతున్నాయి. కానీ అవి ‘కల్కి’ జోరును ఏమాత్రం ఆపుతాయో అన్నది సందేహంగానే ఉంది.

ఈ వారం కొత్త చిత్రాల్లో ముందు చెప్పుకోవాల్సింది.. ‘డార్లింగ్’ గురించే. కమెడియన్‌గా పరిచయమై ఆ రోల్సే చాలా వరకు చేస్తూ వచ్చి.. ఆ తర్వాత మల్లేశం, బలగం లాంటి చిత్రాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు ప్రియదర్శి. అతను లీడ్ రోల్‌లో, తనకు జోడీగా నభా నటేష్ నటించిన చిత్రమిది. కొత్త దర్శకుడు అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ‘హనుమాన్’ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కొంచెం బజ్ అయితే క్రియేట్ అయింది ఈ చిత్రానికి. మరి టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

దీంతో పాటు తమిళ నటుడు వినోద్ నటించిన ‘పేకమేడలు’ అనే ఇంట్రెస్టింగ్ మూవీ ఈ వారం థియేటర్లలోకి దిగుతోంది. దీనికి ముందే పెయిడ్ ప్రిమియర్స్ వేశారు. స్పందన పర్వాలేదు. ఇంకా ‘ది బర్త్ డే బాయ్’ అని ఇంకేవో కొన్ని చిన్న సినిమాలు ఈ వారం రిలీజవుతున్నాయి. అవి పెద్దగా ప్రేక్షకుల దృష్టిలో పడుతున్నట్లు లేవు. మరి ఈ సినిమాల్లో ‘కల్కి’ జోరును తట్టుకుని నిలబడి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేవి ఏవో చూడాలి. ఈ చిత్రాలకు టాక్ లేకుంటే మరో వీకెండ్ ‘కల్కి’ దూకుడే చూడొచ్చు.