దేవరతో పోటీకి సై అంటున్న కార్తీ

సెప్టెంబర్ 27 విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1కి ఇప్పటిదాకా పోటీ లేదు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ ప్యాన్ ఇండియా మూవీని హిందీ, తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీ హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్లు అప్పుడే సింగల్ స్క్రీన్లను బ్లాక్ చేయడం మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఏరియాల వారీగా మొదలైపోయింది. ముందు అనుకున్న అక్టోబర్ 10 కాకుండా రెండు వారాలు ముందే రావడం పట్ల అభిమానులు హ్యాపీగా ఉన్నారు. అయితే ఇక్కడితో ట్విస్టు అయిపోలేదు.

తారక్ తో పోటీ పడేందుకు కార్తీ సిద్ధమంటున్నాడు. 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన మెయ్యజగన్ సెప్టెంబర్ 27 రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ సమాంతరంగా రిలీజవుతుందని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఏపీ తెలంగాణలో దీని వల్ల దేవరకు ఎలాంటి సమస్య రాదు. కానీ తమిళనాడులో కార్తీ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కేరళలోనూ ఆ అవకాశాన్ని కొట్టి పారేయలేం. అరవింద్ స్వామి మరో కీలక పాత్ర పోషించిన ఈ విలేజ్ డ్రామాలో శ్రీదివ్య హీరోయిన్ గా నటించింది. గోవింద్ వసంత్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇదే టీమ్ శర్వానంద్ 96 తీసింది.

ఇంతేనా అనుకోకండి. జయం రవి బ్రదర్, కెవిన్ బ్లడీ బెగ్గర్ కూడా అదే డేట్ కోసం చూస్తున్నాయి.. ఇదే జరిగితే అన్ని భాషల్లో మంచి రిలీజ్ దక్కించుకోవాలని చూస్తున్న దేవరకు ముఖ్యంగా తమిళంలో ఇబ్బందులు తప్పవు. షూటింగ్ ఇంకా కొంచెం బ్యాలన్స్ ఉండటంతో అనుకున్న టైంకి జూనియర్ వస్తాడా లేదా అనే అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బృందం మాత్రం అవన్నీ పుకార్లేనని కొట్టి పారేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 27 దేవర రావడం ఫిక్సే. తెలుగులో తప్ప మిగిలిన భాషల్లో సోలోగా బరిలో దిగడం మాత్రం సాధ్యపడేలా కనిపించడం లేదు.