క‌ల్కి కోసం ఎదురు చూపులు త‌ప్ప‌వు

కొన్ని సినిమాల‌ను థియేట‌ర్ల‌లో మాత్ర‌మే చూడాల‌ని అంటారు. అలాంటి చిత్రాల్లో క‌ల్కి 2898 ఏడీ ఒక‌టి. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సినిమాల మీద ఆస‌క్తి ఉన్న వాళ్లు కూడా అంద‌రూ థియేట‌ర్ల‌కు రావ‌ట్లేదు. సినిమా బాగున్నా స‌రే.. ఓటీటీలో వ‌స్తే చూసుకుందాంలే అనుకునే వాళ్లు చాలామందే ఉన్నారు. అలాగే థియేట‌ర్ల‌లో సినిమా చూసిన వాళ్లు కూడా ఆ సినిమా న‌చ్చితే ఓటీటీలో వ‌చ్చిన‌పుడు మ‌ళ్లీ ఓ లుక్కేద్దాం అని చూస్తుంటారు.

ఐతే క‌ల్కి సినిమా కోసం ఇలా ఎదురు చూస్తున్న వాళ్ల‌కు సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌ప్ప‌దు. ఎందుకంటే మామూలుగా పెద్ద సినిమాలు 50 రోజుల త‌ర్వాత ఓటీటీల్లోకి వ‌చ్చేస్తుంటాయి కానీ.. క‌ల్కి డిజిట‌ల్ రిలీజ్ మాత్రం ఇంకా ఆల‌స్యం కాబోతోంది. విడుద‌లైన 70 రోజుల‌కు గానీ క‌ల్కి ఓటీటీలోకి రాద‌న్న‌ది లేటెస్ట్ స‌మాచారం.

క‌ల్కి డిజిట‌ల్ హ‌క్కుల‌ను స్ట్రీమింగ్ జెయింట్ అమేజాన్ ప్రైమ్ ద‌క్కించుకుంది. ఈ విష‌యం సినిమా టైటిల్స్ స‌మ‌యంలోనే వెల్ల‌డైంది కూడా. హిందీలో రిలీజ‌య్యే సినిమాల‌ను 50 రోజుల్లోపు ఓటీటీల్లో విడుద‌ల చేస్తే మ‌ల్టీప్లెక్సులు అంగీక‌రించ‌వ‌న్న సంగ‌తి తెలిసిందే. అందుకే పాన్ ఇండియా మూవీ అయిన క‌ల్కి కూడా 50 రోజుల్లోపు ఓటీటీలోకి రాద‌ని అంద‌రికీ తెలుసు.

ఐతే క‌ల్కిని మాత్రం ఏకంగా 70 రోజుల త‌ర్వాతే ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ఈ చిత్రం విడుద‌లైన మూడు వారాల త‌ర్వాత కూడా మంచి వ‌సూళ్లే సాధించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. గ‌త వీకెండ్లో వచ్చిన పెద్ద సినిమా ఇండియ‌న్-2 నిరాశ‌ప‌ర‌చ‌డం క‌ల్కికిక‌లిసొచ్చింది. మూడో వీకెండ్లోనూ ఆ సినిమా మంచి వ‌సూళ్లు సాధించింది. ఇంకో రెండు వీకెండ్స్ ఈ సినిమా చెప్పుకోద‌గ్గ షేరే రాబ‌ట్టేలా ఉంది. ఇప్ప‌టికే ఈ చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్ల మైలురాయిని దాటేసిన సంగ‌తి తెలిసిందే.