హైదరాబాద్, బెంగళూరు…ఇలా డ్రగ్స్ పట్టుబడిన చోట ఎంతో కొంత లింక్ సినీ పరిశ్రమకు ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా హైదరాబాద్ లో మరో డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన లింక్ దొరకడం సంచలనం రేపుతోంది. తాజాగా ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు, హీరో అమన్ ప్రీత్ సింగ్ ను డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారని తెలుస్తోంది.
అమన్ ప్రీత్ సింగ్ దగ్గర నుంచి సుమారు 200 గ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. రాజేంద్రనగర్ డివిజన్ పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. వారు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అయిదుగురు విఐపిలలో అమన్ ప్రీత్ సింగ్ కూడా ఒకరిని తెలుస్తోంది. ఇటీవల అమన్ ప్రీత్ సింగ్ తెరంగేట్రం చేసి ఓ సినిమాలో హీరోగా కూడా నటించాడు.
అయితే, ప్రస్తుతానికి ఈ స్టింగ్ ఆపరేషన్ పూర్తి కాకపోవడంతో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా పోలీసులు మీడియాకు వెల్లడించలేదు. 200 గ్రాముల కొకైన్ ధర మార్కెట్లో కొన్ని కోట్లు ఉంటుందని అంచనా. మరి, ఈ వ్యవహారంలో అరెస్ట్ అయిన మిగతా నలుగురు వీఐపీలు ఎవరు? వారికి సినీ పరిశ్రమతో ఏమైనా లింకులు ఉన్నాయా? అన్న సంగతి ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రం ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates