పురుషోత్తముడు పెద్ద రిస్కే తీసుకుంటున్నాడు

లావణ్య అనే అమ్మాయితో వివాహ బంధానికి సంబంధించిన కేసులో ఇరుక్కున్న రాజ్ తరుణ్ దాన్నుంచి ఎప్పుడు బయట పడతాడో అంతు చిక్కడం లేదు. బలమైన సాక్ష్యాలతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మొన్న అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంటానంటూ లాయర్ కు మెసేజ్ పెట్టడం కలకలం రేపింది. ప్రాణాలు కాపాడటం జరిగింది కానీ మున్ముందు ఏం చేస్తుందోననే టెన్షన్ జనాల్లో లేకపోలేదు. ఇలాంటి పరిస్థితులలో రాజ్ తరుణ్ కొత్త సినిమాలు రిలీజ్ చేయడం రిస్కే. కానీ పురుషోత్తముడు నిర్మాతలు దాన్ని స్వీకరించడానికి సిద్ధమంటున్నారు.

జూలై 26న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ పత్రికల్లో ప్రకటన కూడా వచ్చింది. నిజానికి దీనికన్నా ముందు తిరగబడరా సామీ రావాలి. కానీ సిచువేషన్ చూసిన ఆ చిత్ర బృందం ఆగస్ట్ 2కి వాయిదా వేసుకుంది. కానీ కేవలం వారం ముందు పురుషోత్తముడు వస్తోంది కాబట్టి మళ్ళీ పోస్టు పోన్ చేయక తప్పేలా లేదు. అయితే ఇక్కడ రిస్క్ అన్నది కేవలం పోలీస్ కేసు గురించి మాత్రమే కాదు. అదే జూలై 26న ధనుష్ రాయన్ భారీ అంచనాలతో వస్తోంది. సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించడంతో పాటు పోస్టర్లు గట్రా జనాల్లో ఆసక్తిని పెంచాయి.

అల్లు శిరీష్ బడ్డీ ఇదే డేట్ ని గతంలో అఫీషియల్ గా లాక్ చేసుకుంది. వీటి మధ్య నెగ్గడం పురుషోత్తముడుకి ఒక ఛాలెంజ్ అయితే కేవలం రెండు వారాలు చేతిలో పెట్టుకుని ప్రమోషన్లు ఎలా చేస్తారనేది పెద్ద ప్రశ్న. పైగా ప్రెస్ మీట్లు పెడితే రాజ్ తరుణ్ రావాలి. కేసు గురించి అడక్కుండా మీడియా ఉండలేదు. ఒకవేళ దాని మీదే ఎక్కువ చర్చ జరిగినా, ఏదైనా వివాదం రేగినా అదో పెద్ద తలనెప్పి. ఇదంతా దృష్టిలో ఉంచుకుని కూడా రావడమంటే సాహసమే. రాజ్ తరుణ్ కెరీర్ లోనే పురుషోత్తముడు అత్యధిక బడ్జెట్ తో రూపొందింది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ లాంటి పెద్ద క్యాస్టింగ్ ఉంది.