ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య ‘నారి నారి నడుమ మురారి’ విజయం సాధించగా ఏప్రిల్ లో ‘బైకర్’ రూపంలో సరికొత్త మేకోవర్ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ రెండు చాలని అభిమానులు సంతృప్తి పడతారేమో. నో ఛాన్స్. మూడోది కూడా వస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోగి’ ఆగస్ట్ 28 విడుదల చేయబోతున్నట్టు టీమ్ అధికారికంగా ప్రకటించింది. మంచి డేట్లకు కాంపిటీషన్ ఎక్కువగా ఉండటంతో ముందస్తు ప్లానింగ్ తో ఆరు నెలల ముందే రిలీజ్ స్లాట్ లాక్ చేసుకుంది. ఇక అసలు విషయమైన రిస్కుకు వద్దాం.

ఆగస్ట్ 28 చాలా మంచి డేట్ అయినప్పటికీ దానికి కేవలం వారం రోజుల ముందే ది ప్యారడైజ్ వచ్చి ఉంటుంది. దాని మీద ఉన్న బజ్ తెలిసిందే. ఆయా షేర్ పాట వచ్చాక అంచనాలు రెట్టింపయ్యాయి. ప్యాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ప్యారడైజ్ కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే దాని ప్రభావం ఎంతలేదన్నా సులభంగా రెండు మూడు వారాలు ఉంటుంది.

ఆ మేనియాలో జనాలకు ఇతర సినిమాలు అంత ఈజీగా కనెక్ట్ కావు. అయినా అర్ భోగి టీమ్ రిస్క్ కు రెడీ అందంటే కంటెంట్ ఏదో బలంగా ఉన్నట్టే. అరవై దశకం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో శర్వానంద్ లుక్ షాకింగ్ గా ఉంది.

ఇప్పటిదాకా చేయని ఊర మాస్ అవతారాన్ని శర్వానంద్ భోగిలో చేస్తున్నాడు. పెద్ద ఎత్తున సెట్లు వేశారు. అవుట్ ఫుట్ ఓ రేంజ్ లో వస్తోందని యూనిట్ టాక్ ఉంది. మరి తక్కువ గ్యాప్ లో ప్యారడైజ్ తో తలపడేందుకు సిద్ధం కావడం ఆసక్తి రేపుతోంది. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో అనౌన్స్ మెంట్ల తర్వాత కూడా ఎవరు మాట మీద ఉంటారో గ్యారెంటీగా చెప్పలేని సంకటం నెలకొంది.

ప్రభాస్ నుంచి అడివి శేష్ దాకా అందరిదీ ఇదే కథ. అలాంటిది చాలా దూరంలో ఉన్న ఆగస్ట్ రిలీజులు ఖచ్చితంగా మాట మీద ఉంటాయా అంటే చెప్పలేం. ఉంటే మాత్రం నాని, శర్వా మధ్య రసవత్తరమైన మాస్ యుద్ధం చూడబోతున్నాం.