బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక రాజు ఈ ఘ‌న‌త సాధించింది. ఈ సినిమా అంత పెద్ద విజ‌యం సాధించింది అంటే అందులో న‌వీన్ క్రెడిటే అత్య‌ధికం. న‌టుడిగానే కాక రైట‌ర్‌గానూ ఈ సినిమా విజ‌యంలో అత‌ను కీల‌క పాత్ర పోషించాడు.

దీని కంటే ముందు అత‌డి నుంచి మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి, జాతిర‌త్నాలు, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి స‌క్సెస్ ఫుల్ సినిమాలు వ‌చ్చాయి. కానీ అంత‌కంటే ముందు న‌టుడిగా నిల‌దొక్కుకోవ‌డానికి అత‌ను చాలా క‌ష్టాలే ప‌డ్డాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, 1 నేనొక్క‌డినే స‌హా ప‌లు చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేశాడు.

బాలీవుడ్‌కు వెళ్లి అవ‌కాశాల కోసం చాలానే ప్ర‌య‌త్నించాడు. అక్క‌డ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పేరు సంపాదించాక చిచ్చోరే సినిమాలో అవ‌కాశం అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. న‌టుడిగా, మోడ‌ల్‌గా బాలీవుడ్‌లో ప్ర‌య‌త్నాలు చేసేట‌పుడు తాను ఎదుర్కొన్న విచిత్ర‌మైన అనుభ‌వం గురించి న‌వీన్ ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు.

బాలీవుడ్లో మేల్ ఆర్టిస్టుల‌కు యాక్టింగ్ టాలెంట్ కంటే కూడా సిక్స్ ప్యాక్ ఉందా లేదా అన్న‌దే అక్క‌డ ముఖ్యం కావ‌డం త‌న‌కు ఆశ్చ‌ర్యం క‌లిగించిన‌ట్లు న‌వీన్ చెప్పాడు. తాను ముంబ‌యిలో ఆడిష‌న్స్ కోసం వెళ్లిన‌పుడు సిక్స్ ప్యాక్ చేసుకుని ర‌మ్మ‌ని చెప్పిన‌ట్లు న‌వీన్ వెల్ల‌డించాడు. సిక్స్ ప్యాక్ లేనందుకు త‌న‌ను రిజెక్ట్ చేశార‌ని కూడా అత‌ను చెప్పాడు.

ఐతే ఒక అథ్లెట్ పాత్ర చేయాల్సిన‌పుడు సిక్స్ ప్యాక్ చేయ‌మంటే అది అవ‌స‌ర‌మే కాబ‌ట్టి చేయ‌డానికి ఓకే అని.. కానీ పాత్ర‌తో సంబంధం లేకుండా సిక్స్ ప్యాక్ చేయాల‌న‌డ‌మేంటో త‌న‌కు అర్థం కాలేద‌ని అత‌న‌న్నాడు. త‌న‌ను రిజెక్ట్ చేసింది చిప్స్ అడ్వ‌ర్టైజ్మెంట్ మోడ‌ల్‌గా అని.. సిక్స్ ప్యాక్ ఉన్న‌వాడు చిప్స్ ఎందుకు తింటాడో త‌న‌కు అంతుబ‌ట్ట‌లేద‌ని న‌వీన్ వ్యాఖ్యానించాడు.

బాలీవుడ్‌లో సిక్స్ ప్యాక్స్ ప‌ట్ల ఎలాంటి మోజు ఉంటుందో న‌వీన్ ఈ ఉదాహ‌ర‌ణ‌తో బ‌ట్ట‌బ‌య‌లు చేశాడు. స‌ల్మాన్ ఖాన్, హృతిక్ రోష‌న్ లాంటి హీరోల ప్ర‌భావంతో బాలీవుడ్లో హీరో కావాలంటే సిక్స్ ప్యాక్ ఉండాల్సిందే అన్న ఒక ముద్ర ప‌డిపోవడానికి దీనికి కార‌ణ‌మ‌ని చెప్పొచ్చు.