బిగ్ బాస్‌లో మరో వైల్డ్ కార్డ్.. ఈసారి అమ్మాయ్

ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల విషయంలో షో ఆరంభానికి ముందు వ్యతిరేకత కనిపించింది. షో మొదలయ్యాక కూడా అదే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ కరోనా వల్ల అన్ని రకాల వినోదాలకూ దూరమైన జనాలు.. ఈ షోను విరగబడి చూస్తున్నారని దాని రేటింగ్స్ చూస్తే అర్థమైంది. గత మూడు సీజన్ల రికార్డులను బద్దలు కొట్టే టీఆర్పీలు వస్తున్నాయి షోకు. ఇక హౌస్ లోపలి వ్యవహారాలు మరీ ఎగ్జైటింగ్‌గా ఏమీ లేకపోయినా.. ఆదరణకు ఏమీ లోటు లేదు.

ఈసారి షో రెండు వారాలు అయ్యేసరికే ఇద్దరు కొత్త కంటెస్టంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి వారం సూర్య కిరణ్ నిష్క్రమించగా.. అతడి స్థానంలో కమెడియన్ సాయి వచ్చాడు. రెండో వారం ఎలిమినేషన్‌కు ముందే జబర్దస్త్ కమెడియన్ అవినాష్ ఎంట్రీ ఇచ్చాడు.

ఇప్పుడు హౌస్‌లోకి మూడో కొత్త వ్యక్తి రాబోతోంది. ఐతే ఈసారి హౌస్‌లోకి రాబోయేది అబ్బాయి కాదు.. అమ్మాయి. హౌస్‌లో గ్లామర్ డోస్ మరింత పెంచే ఉద్దేశంతో ఒక హాట్ హీరోయిన్ని షోలోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆ అమ్మాయి పేరు.. స్వాతి దీక్షిత్. ‘లేడీస్ అండ్ జెంటిల్‌మన్’, ‘జంప్ జిలానీ’ లాంటి సినిమాల్లో హాట్ హాట్‌గా కనిపించిందీ అమ్మాయి. వీటితో పాటు బ్రేకప్, చిత్రాంగత తదితర చిత్రాల్లో నటించిందామె.

తమిళం, బెంగాలీల్లోనూ సినిమాలు చేసిన సాక్షి ఇప్పుడు చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉంది. ఇలాంటి టైంలో బిగ్ బాస్ ఆఫర్ రావడంతో ఓకే అన్నట్లుంది. ఇప్పటికే మోనాల్, దివి, హారిక, సుజాత, అరియానా లాంటి అమ్మాయిలతో ‘బిగ్ బాస్’లో గ్లామర్‌కు లోటు లేదు. ఇప్పుడు స్వాతి సైతం రావడంతో కుర్రాళ్లు షో పట్ల మరింత ఆకర్షితులయ్యే అవకాశముంది. కాగా ఈ వారం టీవీ9 దేవి, సాయి, అరియానా తదితరులు ఎలిమినేషన్ జాబితాలో ఉన్నారు.