నిర్దోషిని.. రక్షించండి-‘మా’కు హేమ లేఖ

రెండు నెలల కిందట సినీ నటి హేమ రేవ్ పార్టీ వ్యవహారం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొందంటూ ఆమెపై కేసు పెట్టిన అక్కడి పోలీసులు ఆమెకు నోటీసులు పంపడం.. తర్వాత హేమను విచారించడం హాట్ టాపిక్‌గా మారింది. హేమ ఆ పార్టీ టైంలో బెంగళూరుకు విమానంలో వెళ్లిన విషయం.. అలాగే రేవ్ పార్టీ జరిగిన చోటి నుంచే వీడియో చేసిన విషయం కూడా వెల్లడైంది.

హేమ బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీంతో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా)లో హేమ సభ్యత్వాన్ని తొలగించారు. ఐతే ఇప్పుడు హేమ తాను నిర్దోషినంటూ ‘మా’ అధ్యక్షుడు విష్ణును కలిశారు.

తనపై ‘మా’ నిషేధాన్ని తొలగించాలంటూ మొరపెట్టుకున్నారు. ఈ మేరకు ఆమె ఒక లేఖ రాసి విష్ణుకు సమర్పించారు. “మీడియా నాపై నిరాధారమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్‌లో నేను పరీక్షలు చేయించుకున్నా. వాటిలో నేను డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టమైంది. త్వరలోనే పోలీసులు చేసిన పరీక్షల్లోనూ అవే రిజల్ట్స్ వస్తాయని నమ్మకం ఉంది. ఈలోపే నన్ను దోషిగా భావించి ‘మా’ సభ్యత్వం రద్దు చేయడం సరైంది కాదని భావిస్తున్నా. కొన్ని రోజులుగా నా మీద జరుగుతున్న ప్రచారం వల్ల నేను తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నా. ఈ పరిస్థితుల్లో నాకు ‘మా’ అండగా నిలవాలి. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నా. ఇలాంటి ప్రచారం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటి నుంచి నన్ను రక్షించాల్సిన బాధ్యత ‘మా’ మీద ఉంది. ఈ విషయాన్ని గుర్తించి నాపై సస్పెన్షన్ ఎత్తివేస్తారని ఆశిస్తున్నా” అని ఈ లేఖలో హేమ పేర్కొంది.