మలయాళంలో ఎంత బిజీగా ఉన్నా సరే దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ కెరీర్ ని సీరియస్ గా తీసుకుంటున్నాడు. అందుకే మహానటిలో తన వయసు, ఇమేజ్ కి నప్పని పాత్ర అయినా సరే ఒప్పుకుని మెప్పించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు.
డబ్బింగ్ మూవీ కనులు కనులు దోచాయంటే తెలుగులో కూడా కమర్షియల్ గా వర్కౌట్ అయ్యింది. అందుకే కష్టం అనిపించినా సరే తన పాత్రలకు తనే గొంతు ఇచ్చి తండ్రి బాటలో నడుస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ చేస్తున్నాడు. సితార బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.
దీని సంగతలా ఉంచితే దుల్కర్ సల్మాన్ ఇంకో టాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. వైజయంతి సంస్థ నిర్మించబోయే సినిమాకు పవన్ సాధినేని దర్శకుడిగా లాకైనట్టు వినికిడి. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రస్తుతమైతే చర్చలు చివరి దశలో ఉన్నాయట.
దుల్కర్ కు ఈ బ్యానర్ తో చాలా బంధం ఉంది. మహానటి తర్వాత సీతా రామమ్ తో బ్లాక్ బస్టర్ సాధించాక అది మరింత బలపడింది. ఆ కారణంగానే కల్కి 2898 ఏడిలో ఏమంత ప్రాధాన్యం ఉన్న పాత్ర కాకపోయినా ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు. ఒకవేళ కల్కి 2లో దాన్ని పొడిగించిన నో చెప్పడు.
మరి పవన్ సాధినేని చెప్పిన కథలో ఏదో బలమైన కంటెంట్ ఉంటేనే ఓకే అయ్యుండొచ్చు. నిజానికి ఇతను తీసిన సినిమాలు తక్కువే. డెబ్యూ చేసిన ప్రేమ ఇష్క్ కాదల్ పేరు తీసుకురాగా నారా రోహిత్ సావిత్రి ఆడలేదు. చాలా గ్యాప్ తీసుకుని రాజేంద్రప్రసాద్ సేనాపతి ద్వారా ఫామ్ లోకి వచ్చాడు.
జెడి చక్రవర్తితో తీసిన వెబ్ సిరీస్ దయాకు సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టోరీ నచ్చితే ట్రాక్ రికార్డు చూడని వైజయంతి ఆ నమ్మకంతోనే హను రాఘవపూడికి ఛాన్స్ ఇచ్చి సీతారామంతో గొప్ప విజయం అందుకుంది. సో పవన్ కు ఛాన్స్ ఉంది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా దీన్ని ధృవీకరించలేం.