గేమ్ ఛేంజర్ తర్వాతే భారతీయుడు 2 అవకాశం

శంకర్ లాంటి అగ్ర దర్శకుడి సినిమాలో అవకాశం రావడమే అదృష్టంగా భావించే నటీనటులు ఎందరో ఉన్నారు. అలాంటిది ఒకేసారి రెండు ఆఫర్లు వస్తే అంతకన్నా లక్కీ ఎవరుంటారు. ఆ ఆనందాన్ని ఎస్జె సూర్య ఆస్వాదిస్తున్నాడు. ఒకప్పుడు డైరెక్టర్ గా ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి ఇప్పుడు పూర్తిగా నటనకే అంకితమైపోయిన ఈ వర్సటైల్ యాక్టర్ కు తమిళం, తెలుగు రెండింట్లోనూ ఛాన్సులు వెల్లువెత్తున్నాయి. నాని సరిపోదా శనివారం కోసం భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ చేయించుకున్నారు. ఇప్పుడు మ్యాటర్ గేమ్ ఛేంజర్, భారతీయుడు 2లకు సంబంధించినది.

చాలా మంది ఎస్జె సూర్య ముందు భారతీయుడు 2కి ఎంపికయ్యాక గేమ్ ఛేంజర్ కు వచ్చాడని అనుకుంటున్నారు. కానీ జరిగింది వేరు. జనవరి 12 విడుదల కాబోతున్న ఇండియన్ 2 ప్రమోషన్ల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఎస్జె సూర్య క్లారిటీ ఇచ్చాడు. శింబు మానాడులో తన పెర్ఫార్మన్స్ చూసి ఆశ్చర్యపోయిన శంకర్ పిలిచి మరీ గేమ్ ఛేంజర్ ఆఫర్ ఇచ్చారు. ఇంకేముంది ఎగిరి గంతేసి ఒప్పేసుకుని ఐఏఎస్ గా నటించిన రామ్ చరణ్ కు సవాల్ విసిరే రాజకీయ నాయకుడి క్యారెక్టర్ అందుకున్నాడు అందులోనూ అదరగొట్టడంతో కమల్ హాసన్ మూవీలో ఛాన్స్ వచ్చింది. .

షూటింగ్ ప్రకారం ముందు మొదలైంది భారతీయుడు 2నే అయినప్పటికీ మధ్యలో క్రేన్ ప్రమాదం వల్ల నెలల తరబడి చిత్రీకరణ ఆగిపోతే అప్పుడు గేమ్ ఛేంజర్ తెరపైకి వచ్చింది. అప్పటికింకా కమల్ సినిమాలో ఎస్జె సూర్య లేడు. ఏదైతేనేం డబుల్ జాక్ పాట్ కొట్టడమంటే ఇదే. కథ, బ్యానర్, కాంబోని బట్టి ఆరు నుంచి పది కోట్ల దాకా తీసుకుంటున్న ఎస్జె సూర్య తిరిగి దర్శకుడిగానూ త్వరలో ఒక సినిమా చేస్తానని అంటున్నాడు. అయినా ఏ ముహూర్తంలో మహేష్ బాబు స్పైడర్ లో మెప్పించాడో కానీ అప్పటి నుంచి ఇతని జాతకమే మారిపోయింది. ఆ సినిమా డిజాస్టరైనా ఎస్జె సూర్య మాత్రం బ్లాక్ బస్టరయ్యాడు.