ఏపీ డిప్యూటీ సిఎంగా కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు వహిస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంత యాక్టివ్ గా ఉన్నా, ఆయన్ని సినిమాల్లో చూడాలనుకునే అభిమానుల ఆతృత అర్థం చేసుకోదగినదే. ముఖ్యంగా ఓజి గురించి వాళ్ళ ఎదురు చూపులు మాములుగా లేవు. వీలైనంత త్వరలో షూటింగ్ సెట్లో అడుగు పెడతారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంలో నిన్న పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో పవన్ తన నిర్మాతలతో సహా అందరికీ క్లారిటీ ఇచ్చేశారు. కనీసం మూడు నెలల పాటు ఏకధాటిగా పాలన మీద దృష్టి పెట్టి పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని అన్నారు.
రోడ్ల పై గుంతలు పూడ్చకుండా, ఇచ్చిన హామీలు నెరవేరే దిశగా చర్యలు తీసుకోకుండా ఓజికి వెళ్తే జనం క్యాజీ అంటారు కాబట్టి తన కర్తవ్యం ఇప్పకిప్పుడు సినిమాల్లో నటించడం కాదని తేల్చేశారు. వీలుని బట్టి నెలకు రెండు మూడు డేట్లు ఇచ్చి సహకరిస్తానని, అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టాలని చెప్పారు. సో దీన్ని బట్టి ప్రాధాన్యత క్రమంలో ముందు హరిహర వీరమల్లు రీ స్టార్ట్ అవుతుంది కానీ పవన్ ప్రసంగాన్ని విశ్లేషిస్తే దసరా తర్వాత కానీ సాధ్యమయ్యేలా లేదు. నిర్మాత ఏఎం రత్నం చూస్తేనేమో డిసెంబర్ విడుదలను టార్గెట్ గా పెట్టుకున్నప్పటికీ ఏ మేరకు సాధ్యమవుతుందో చెప్పలేం.
ఇక్కడో ట్విస్టు ఏంటంటే పవన్ ఓజి ప్రస్తావన తెచ్చారు తప్పించి హరిహర వీరమల్లు గురించి కాకపోవడం గమనార్షం. వీటికే ఇలా ఉంటే ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పటికో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పవన్ మాటల్లో మరొక విషయం చూచాయగా బయట పడుతోంది. ప్రస్తుతం పూర్తి చేయాల్సిన సినిమాలు కాకుండా ఇక కొత్త కమిట్ మెంట్లు ఇవ్వకపోవచ్చనే సంకేతం పవర్ స్టార్ మనసులో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ అయిదేళ్ళు పవన్ పొలిటికల్ కెరీర్ ని సీరియస్ గా తీసుకోబోతున్నాడు. ఇలాంటి పరిస్థితిలో కథలు విని, డేట్లు ఇచ్చే అలోచన చేయకపోవచ్చు. సమాజం కోసం కొంత త్యాగం తప్పదు మరి.
Gulte Telugu Telugu Political and Movie News Updates