పక్కా ప్లానింగుతో సలార్ 2 అడుగులు

గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ టాక్ పరంగా కొంత మిశ్రమ స్పందన దక్కించుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఆరు వందల కోట్లకు పైగా రాబట్టి ప్రభాస్ స్టామినాని చాటింది. అప్పటి నుంచే సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం మీద అంచనాలు పెరిగిపోయాయి. అసలైన కథ రెండో భాగంలోనే ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ పలు సందర్భాల్లో నొక్కి వక్కాణించడంతో అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఒక దశలో ఇది ఆగుతుందేమోననే ప్రచారం కూడా జరిగింది. కానీ అదంతా వట్టి గాలి బుడగేనని లేటెస్ట్ అప్డేట్.

హోంబాలే వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సలార్ 2 వచ్చే నెల అంటే ఆగస్ట్ 10 నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉందట. ఎనిమిది నెలల్లో పూర్తి చేసే లక్ష్యం పెట్టుకుని దానికి అనుగుణంగానే షెడ్యూల్స్ వేస్తారని తెలిసింది. ఫస్ట్ పార్ట్ తో పాటుగా ఇప్పటికే 20 శాతం సీక్వెల్ నీల్ తీశారని, మిగిలింది రామోజీ ఫిలిం సిటీలో భద్రంగా కాపాడుతూ వస్తున్న సెట్లలో కొనసాగిస్తారని వినికిడి. జూనియర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్) ని సమాంతరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మొదలు పెడతానని నీల్ మైత్రికి హామీ ఇచ్చాడట.

తాజాగా కల్కి 2898 ఏడికి వచ్చిన రెస్పాన్స్ చూసి సలార్ 2కి ఖచ్చితంగా అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోతాయనే నమ్మకం మేకర్స్ లో ఉంది. ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. హను రాఘవపూడితో లాక్ చేసుకున్న సినిమాకు ఇంకా ముహూర్తం నిర్ణయించలేదు. కల్కి 2 ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలనే దాని గురించి నాగ్ అశ్విన్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. స్పిరిట్ స్క్రిప్ట్ పూర్తయితే తప్ప సందీప్ రెడ్డి వంగా నుంచి అప్డేట్ ఆశించలేం. ఈ నేపథ్యంలో సలార్ 2 అడుగులు వేగంగా పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బడ్జెట్ కూడా రెట్టింపు చేస్తారని యూనిట్ టాక్.