‘కల్కి’ని వాళ్లు తగ్గించాలని చూసినా..

‘బాహుబలి’ చిత్రాన్ని కరణ్ జోహార్ హిందీలో రిలీజ్ చేయడం వల్లో.. లేక ఆ చిత్రం వల్ల బాలీవుడ్ ఉనికికే ముప్పు వస్తుందనే అంచనా లేకపోవడం వల్లో అక్కడి మీడియా దాని ప్రమోషన్లకు ఎంతగానో సహకరించింది. ఆ సినిమాను ఎంత పుష్ చేయాలో అంతా చేసింది. కానీ ‘బాహుబలి’ ముందు తర్వాత వచ్చిన భారీ బాలీవుడ్ చిత్రాలు వెలవెలబోవడంతో హిందీ ప్రేక్షకులు నెమ్మదిగా అక్కడి చిత్రాల మీద ఆసక్తి కోల్పోయారు.

అదే సమయంలో కార్తికేయ-2, పుష్ప, ఆర్ఆర్ఆర్, హనుమాన్ లాంటి తెలుగు చిత్రాలు హిందీలో ఇరగాడేసి బాలీవుడ్ వాళ్లు మన చిత్రాల పట్ల అసూయ చెందేలా చేశాయి. అందుకే ఈ మధ్య మన సినిమాలను వాళ్లు పెద్దగా ఎలివేట్ చేయట్లేదు. పైగా వాటి స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ సినిమాలను పనిగట్టుకుని టార్గెట్ చేయడం గమనించవచ్చు.

‘సలార్’ను ఎంతగా ఎటాక్ చేసినా ఆ చిత్రం హిందీలో మాస్ ఆడియన్స్‌ను ఒక ఊపు ఊపి భారీ వసూళ్లు సాధించింది. ఇక ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ విషయానికి వస్తే కొంతమంది క్రిటిక్స్ దానికి తక్కువ రేటింగ్స్ ఇవ్వడమే కాక.. ఎక్కువగా నెగెటివ్ కామెంట్లే చేశారు. వసూళ్ల విషయంలో కూడా ఫేక్ అంటూ ఆరోపణలు చేశారు. కానీ ‘కల్కి’ మీద ఇవేవీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. మాస్ సెంటర్లలో ఆ చిత్రం అదరగొడుతోంది.

హిందీ బెల్ట్‌లో ప్రభాస్ ఫాలోయింగ్, మార్కెట్ చెక్కుచెదరలేదని ‘కల్కి’తో మరోసారి రుజువవుతోంది. నిజానికి స్లంప్‌లో ఉన్న నార్త్ బాక్సాఫీస్‌కు ‘కల్కి’ ఊపిరులూదుతోంది. ఈ నెల ఆరంభంలో వచ్చిన ముంజ్యా, కల్కి సినిమాలే సమ్మర్ స్లంప్ తర్వాత థియేటర్లను ఆదుకుంటున్నాయి. మన సినిమాను అక్కడి క్రిటిక్స్ టార్గెట్ చేసినా.. ఆ చిత్రమే అక్కడి థియేటర్లకు కళ తెస్తుండడం చూసి అయినా వాళ్లు కొంచెం మారాలి.