క‌ల్కి పాత్ర‌పై విజ‌య్ ఏమ‌న్నాడంటే..?

క‌ల్కి సినిమాలో ముఖ్య పాత్ర‌ల గురించి ఎంత చ‌ర్చ జ‌రిగిందో విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన అతిథి పాత్ర మీద కూడా అంతే డిస్క‌ష‌న్ న‌డిచింది. విజ‌య్ ఇందులో ఒక‌ట్రెండు నిమిషాలే క‌నిపించే అర్జునుడి పాత్ర‌లో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే.

ఐతే అర్జునుడిగా విజ‌య్ గెట‌ప్ బాలేద‌ని.. త‌న డైలాగ్ డెలివ‌రీ తేడా కొట్టింద‌ని సోష‌ల్ మీడియాలో త‌న‌ను విప‌రీతంగా ట్రోల్ చేశారు. దీని మీద పెద్ద గొడ‌వే న‌డిచింది నెటిజ‌న్ల మ‌ధ్య‌. కొన్ని రోజులుగా ఈ గొడ‌వ న‌డుస్తుండ‌గా.. త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ డీపీలో త‌న‌ను ట్రోల్ చేస్తున్న గెట‌ప్ ఫొటోనే పెట్టి త‌న రూటే వేర‌ని చాటాడు విజ‌య్. కాగా ఇప్పుడు ఈ పాత్ర గురించి అత‌ను ఓ కార్య‌క్ర‌మంలో భాగంగా మీడియాతోనూ మాట్లాడాడు.

అర్జున పాత్ర‌కు వ‌స్తున్న స్పంద‌న ప‌ట్ల విజ‌య్ సంతోషం వ్య‌క్తం చేశాడు. ఈ పాత్ర‌ను తాను కేవ‌లం ద‌ర్శ‌కుడు నాగితో ఉన్న స్నేహం, ప్ర‌భాస్ మీద ఉన్న అభిమానంతోనే చేసిన‌ట్లు విజ‌య్ తెలిపాడు. తాను ఇటీవ‌లే సినిమా చూశాన‌ని.. ప్రేక్ష‌కుల స్పంద‌న మామూలుగా లేద‌ని.. త‌న పాత్ర‌కూ మంచి స్పంద‌న వ‌స్తోంద‌ని చెప్పాడు. క‌ల్కి మూవీతో తెలుగు సినిమా స్థాయి ఎక్క‌డికో వెళ్లిపోయింద‌ని.. ఇంత భారీ ప్రాజెక్టులో తాను కూడా భాగం కావ‌డం గ‌ర్వంగా అనిపిస్తోంద‌ని విజ‌య్ తెలిపాడు. తాను సినిమాలో క‌నిపించింది త‌క్కువ స‌మ‌యమే అయినా.. దాని ఇంపాక్ట్ బాగా ఉంద‌ని అత‌న‌న్నాడు.

ప్ర‌భాస్‌తో పోటీ ప‌డ్డారు, ఆయ‌న మీదికే బాణాలు వేశారు క‌దా అని మీడియా వాళ్లు అడిగితే.. అక్క‌డ ఉన్న‌ది తాను, ప్ర‌భాస్ కాద‌ని.. అర్జునుడు, క‌ర్ణుడు అని విజ‌య్ అన్నాడు. ఇదిలా ఉండ‌గా.. క‌ల్కిలో విజ‌య్ చేసిన అర్జునుడి పాత్ర కోసం విజ‌య్ పారితోష‌కం ఏమీ తీసుకోకుండా ఉచితంగానే న‌టించిన‌ట్లు యూనిట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.