తండేల్ దర్శకుడి మెగా ప్లానింగ్

కథలు ఎంచుకునే విషయంలో, టేకింగ్ పరంగా దర్శకుడు చందూ మొండేటిది ప్రత్యేకమైన ముద్ర. మొదటి సినిమా కార్తికేయలో డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ ని తీయడం ద్వారా నిఖిల్ కో సూపర్ హిట్ ఇవ్వడమే కాకుండా డెబ్యూతోనే విమర్శకులను మెప్పించాడు. ఆ తర్వాత ప్రేమమ్ రీమేక్ అయినప్పటికీ నాగ చైతన్య కెరీర్ లో మంచి విజయం అందించింది. సవ్యాసాచి ఆశించిన ఫలితం అందించకపోయినా కార్తికేయ 2తో ఏకంగా ప్యాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ప్రస్తుతం చైతు సాయిపల్లవి కలయికలో తండేల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది కూడా విభిన్నమైన బ్యాక్ డ్రాపే.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం చందూ మొండేటి మెగా ప్లాన్ వేస్తున్నాడట. అదేనండి చిరంజీవికి కథ చెప్పే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. తండేల్ నిర్మాత అల్లు అరవింద్ ద్వారా ప్రాథమికంగా ఒకసారి కలిశాడని అంటున్నారు. ఎలాగూ రామ్ చరణ్ నిర్మాతగా రూపొందుతున్న ది ఇండియా హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్ హీరో కాబట్టి అక్కడిదాకా వెళ్లడం పెద్ద విషయం కాదు. కాకపోతే అధికారికంగా సమాచారం లేదు కాబట్టి ధృవీకరించలేం కానీ మొత్తానికి అంతర్గతంగా దీనికి సంబంధించిన డిస్కషన్ అయితే ఉంది. తండేల్ డిసెంబర్ విడుదలని లక్ష్యంగా చేసుకుని షూటింగ్ లో ఉంది.

ఒకవేళ బాలయ్య 109, గేమ్ చేంజర్ అదే నెలలో వచ్చే పనైతే కాస్త ముందుగానే తండేల్ ని విడుదల చేసే ఆలోచనలో గీతా ఆర్ట్స్ బృందం చేస్తోంది. చందూ మొండేటి లిస్టులో కార్తికేయ 3 కూడా ఉంది. కాకపోతే స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో సిద్ధంగా లేదని వినిపిస్తోంది. ఎలాగూ నిఖిల్ బిజీగా ఉన్నాడు కాబట్టి తెరకెక్కడానికి బాగా టైం పడుతుంది. విశ్వంభరలో తలమునకలైన మెగాస్టార్ ఇంకా ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. హరీష్ శంకర్ ముందు వరసలో ఉండగా ఇంకో ఇద్దరు ముగ్గురు వెయిటింగ్ లో ఉన్నట్టు తెలిసింది. ఆగస్ట్ 22 పుట్టినరోజు లోపు ఎవరో ఒకరిది ఖరారయ్యే అవకాశాలు లేకపోలేదు.