ఓవర్సీస్ లో కల్కి 2898 ఏడి విడుదలకు స్క్రీన్ కౌంట్ పరంగా అడ్డంకిగా నిలిచిన సినిమా ఒకటుంది. అదే ఏ క్వైట్ ప్లేస్ ఛాప్టర్ వన్. 2018 లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీకి ఇది మూడో భాగం. సీక్వెల్ భారీ విజయం సాధించకపోయినా కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది. అందుకే థర్డ్ పార్ట్ మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. యుఎస్, యుకె లాంటి దేశాల్లో కల్కికి ఐమాక్స్ స్క్రీన్లు నిన్నటి నుంచి ఈ కారణంగానే తగ్గిపోయాయి. ముందస్తు ఒప్పందాల వల్ల కల్కికి గురువారం మాత్రమే పూర్తి స్థాయిలో థియేటర్లు దొరికాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూవీని రిలీజ్ చేశారు.
కాకపోతే దీని గురించి టెన్షన్ పడేందుకు ఏమి లేదు. ఎందుకంటే ఆశించిన స్థాయిలో ఏ క్వైట్ ప్లేస్ ఛాప్టర్ వన్ లేదని రివ్యూయర్లు, ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మొదటి భాగం కథలో ఒక నిర్మానుషమైన ప్రదేశంలో శబ్దం వినిపిస్తే చాలు రాకాసి జంతువు వచ్చి అమాంతం ఎగరేసుకుపోయి ప్రాణాలు తీస్తూ ఉంటుంది. అక్కడ చిక్కుకుపోయిన హీరో కుటుంబం ఆ వికృత ప్రాణి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి శబ్దం చేయకుండా ఎలా బయట పడ్డారనేది హారర్ టచ్ తో సాగుతుంది. ఇప్పుడు రిలీజైన ఏ క్వైట్ ప్లేస్ ఛాప్టర్ వన్ లో అసలా ప్రాణులు ఎక్కడ నుంచి వచ్చాయనే పాయింట్ మీద తీశారు.
బ్యాక్ డ్రాప్ బాగున్నప్పటికీ గంటన్నర సినిమా తొలి యాభై నిముషాలు హారర్ కన్నా అవసరం లేని ఎమోషన్ కు ఎక్కువ చోటు ఇవ్వడంతో ఏ క్వైట్ ప్లేస్ ఛాప్టర్ వన్ బోర్ కొట్టేస్తుంది. చివరి క్లైమాక్స్ ఘట్టం మాత్రమే థ్రిల్ కలిగించేలా తీశారు తప్పించి ఒకటి రెండు సన్నివేశాలు మినహాయిస్తే సగానికి పైగా మూవీ విసిగించేస్తుంది. దీన్ని, కల్కిని రెండూ చూసేసిన విదేశీయులు సైతం ప్రభాస్ సినిమాకే ఓటు వేయడం గమనార్హం. దర్శకుడు మారడం కూడా క్వైట్ ప్లేస్ ఛాప్టర్ వన్ తేడా కొట్టేందుకు కారణం కావొచ్చు. ఏపీ తెలంగాణ సిటీస్ కాకుండా చాలా సెంటర్స్ లో కనీస జనం లేక దీని షోలు కల్కికి ఇచ్చేశారు.