దత్తు గారి గట్స్‌కు సెల్యూట్

ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ‘కల్కి’ నిన్ననే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు రెస్పాన్స్ కూడా అదిరిపోయే స్థాయిలోనే వచ్చింది. వేసవిలో సరైన సినిమాలు లేక వెలవెలబోయిన బాక్సాఫీస్‌‌లో ఒక్కసారిగా ఉత్సాహం తీసుకొచ్చింది ‘కల్కి’ మూవీ. ఈ ఏడాది ఇండియా మొత్తాన్ని ఏకం చేసి థియేటర్ల వైపు పరుగులు పెట్టించిన చిత్రమిదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ థియేటర్లు కళకళలాడాయి.

‘కల్కి’ తెలుగు సినిమా మరోసారి సగర్వంగా తలెత్తుకునేలా చేసిందనడంలో సందేహం లేదు. కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న ఓ యువ దర్శకుడిని నమ్మి వైజయంతీ మూవీస్ సంస్థ ఇంత భారీ సినిమాను ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో (దాదాపు రూ.700 కోట్లని అంచనా) రూపొందించడం చిన్న విషయం కాదు.

నాగ్ అశ్విన్ అశ్వినీదత్‌కు అల్లుడే కావచ్చు. అయినా అతడి అనుభవ లేమి గురించి కంగారు పడకుండా ఏమాత్రం రాజీ లేకుండా ఈ సినిమాను నిర్మించడం మామూలు సాహసం కాదు. సినిమాలో విజువల్స్, విజువల్ ఎఫెక్ట్స్ చూసి అశ్వినీదత్ మీద అందరికీ గౌరవభావం కలుగుతోంది. దర్శకుడితో పాటు నిర్మాతనూ అదే స్థాయిలో అభినందిస్తున్నారు జనం.

ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు గత కొన్నేళ్లలో తమకు నచ్చని వారి సినిమాలను టార్గెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అశ్వినీదత్ ఏమో జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. తెలుగుదేశం పార్టీకి ఓపెన్‌గా మద్దతు ప్రకటించారు. ఈ సినిమా నిజానికి గత ఏడాదే రిలీజ్ కావాల్సింది. జగన్ ప్రభుత్వం ఉండగా ‘కల్కి’ రిలీజై ఉంటే మాత్రం అంతే సంగతులు. ఒకవేళ ఏపీలో ప్రభుత్వం మారకపోయి ఉన్నా ‘కల్కి’ టార్గెట్ అయ్యేది. మరి ఈ ప్రమాదం పొంచి ఉన్నా ఇంత భారీ సినిమా తీసి ధైర్యంగా టీడీపీకి మద్దతు పలికి, జగన్‌ను విమర్శించడం గుర్తు చేసుకుని దత్ గట్సే వేరని కొనియాడుతున్నారు నెటిజన్లు.