రాజమౌళిని భలే వాడారే..

‘కల్కి’ సినిమాలో బోలెడన్ని అతిథి పాత్రలు ఉన్నాయని.. సినిమా అంతా సర్ప్రైజ్‌లతో నడుస్తుందని ముందే హింట్స్ వచ్చాయి. క్యామియోస్ గురించి మీడియాలో జరిగిన ప్రచారమంతా నిజమే అని ఈ సినిమా చూశాక అర్థమైంది. పదిమందికి తక్కువ కాకుండా ఇందులో ప్రముఖ నటీనటులు అతిథి పాత్రలు చేయడం విశేషం. ఐతే దర్శకుడు నాగ్ అశ్విన్.. ఆ అతిథి నటులను అనుకున్నంత బాగా ఉపయోగించుకోలేకపోయాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చాలామంది పాత్రలు మొక్కుబడిగా అనిపించాయి. ఐతే దర్శకుడు రాజమౌళి కనిపించింది చాలా తక్కువ టైమే అయినా.. ఆయనకు సూటయ్యే గమ్మత్తైన పాత్రను ఇచ్చి.. తన సీక్వెన్స్ స్క్రీన్ మీద బాగా పేలేలా చూసుకున్నాడు నాగ్ అశ్విన్. ప్రభాస్-రాజమౌళి మధ్య నిజ జీవిత బంధాన్ని చాటేలా ఈ క్యామియో ఎపిసోడ్ ఉండడం విశేషం.

ఇందులో ప్రభాస్ చేసిన భైరవ పాత్రకు మాజీ యజమాని, టెక్నికల్ గురువుగా కనిపించాడు రాజమౌళి. భైరవ తన వెహికల్ (బుజ్జి)లో ఒక టాస్క్ మీద వెళ్తుండగా.. రాజమౌళి పక్కనే మరో వెహికల్లో వచ్చి తన వెంట రమ్మంటాడు. దీనికి భైరవ స్పందిస్తూ.. ఈయనతో వెళ్తే ఇంకో ఐదేళ్లు తినేస్తాడు అని భయపడతాడు. రాజమౌళితో చేసిన ‘బాహుబలి’ కోసం ప్రభాస్ ఐదేళ్లు వెచ్చించిన సంగతి తెలిసిందే.

ఆ సంగతి గుర్తు చేసేలా ప్రభాస్ డైలాగ్ చెప్పడంతో థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. ఇక తన నుంచి ఎస్కేప్ అవుతున్న ప్రభాస్‌ను చూసి.. ఈసారి దొరికితే పదేళ్లు వదలనంటూ రాజమౌళి చెప్పే ఫినిషింగ్ డైలాగ్ మరింత హైలైట్ అయింది. సినిమాలో చిన్న క్యామియోలో రామ్ గోపాల్ వర్మ కూడా కనిపించాడు కానీ.. అందులో ఏ ప్రత్యేకతా కనిపించలేదు. కేవలం వర్మ కనిపించాడని ప్రేక్షకులు అరుస్తారు తప్ప.. ఆయన పాత్రలో, డైలాగుల్లో ఏ విశేషం లేకపోయింది.