భారతీయ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో, అత్యంత భారీగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ ఈ రోజే ప్రేక్షకులను పలకరించింది. ఇది మా సినిమా అని తెలుగు ప్రేక్షకులు గర్వంగా చెప్పుకునే అంశాలు సినిమాలో చాలానే ఉన్నాయి. కథాకథనాల్లో కొంచెం ఎత్తుపల్లాలున్నప్పటికీ.. టికెట్ డబ్బులను మించి వినోదాన్ని, నమ్మశక్యం కానీ విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఈ సినిమా అందిస్తోందనడంలో సందేహం లేదు.
చాలా వరకు సినిమాకు పాజిటివ్ టాకే వస్తోంది. ఐతే ఈ సినిమాకు సంబంధించి ఎక్కువమంది విమర్శిస్తున్న విషయం.. అర్జునుడిగా విజయ్ దేవరకొండ క్యామియోనే. సినిమాలో అతడి పాత్ర కొంచెం ఆడ్‌గా అనిపించిందని.. అర్జునుడి పాత్రలో తన గెటప్, అలాగే డైలాగ్ డెలివరీ బాలేదని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ఐతే విజయ్ అర్జునుడి పాత్రకు సూట్ కాలేదని అని అంటే ఓకే కానీ.. సోషల్ మీడియాలో ఉదయం నుంచి అతడి మీద జరుగుతున్న దాడి మాత్రం ఆక్షేపణీయమే. కేవలం విమర్శించడం కాకుండా.. అతడి మీద అకారణ ద్వేషం చూపిస్తున్నారు చాలామంది. తెలంగాణ టచ్‌తో సాగే విజయ్ స్లాంగ్.. ఏ పాత్ర చేసినా దాంతోకి చొచ్చుకుని వచ్చేస్తుందనే ఒక అభిప్రాయం ఉంది.
‘కల్కి’లో అర్జునుడి పాత్రలోనూ అది కొట్టొచ్చినట్లు కనిపించిందనేది చాలామంది విమర్శ. కానీ ఈ విషయాన్ని మరీ భూతద్దంలో చూపిస్తూ.. విజయ్‌ను అదే పనిగా ట్రోల్ చేస్తున్నారు. తన వల్లేదో సినిమా మొత్తం చెడిపోయిందన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఐతే ఈ బ్యాచ్ విజయ్‌ని టార్గెట్ చేయాలని ముందే ఫిక్సయి థియేటర్లలోకి అడుగు పెట్టిందా.. పనిగట్టుకుని సోషల్ మీడియాలో అతడిని డౌన్ చేయాలని చూస్తోందా అనే సందేహాలు కలుగుతున్నాయి సోషల్ మీడియాలో ట్రోలింగ్ డోస్ చూస్తుంటే.