సందీప్ వంగా మీద అంచనాల ఒత్తిడి  

యానిమల్ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగాకు బాలీవుడ్ లో ఏ స్థాయిలో క్రేజ్ పెరిగిందో చెప్పడం కష్టం. కబీర్ సింగ్ టైంలోనే తన టాలెంట్ ఋజువు చేసుకున్నప్పటికీ అది అర్జున్ రెడ్డి రీమేక్ కావడంతో అసలైన సత్తా బయటపడింది మాత్రం రన్బీర్ కపూర్ మూవీతోనే. అందుకే టి సిరీస్ సంస్థ అతన్ని తమతోనే బంధించేసుకుని భద్రకాళి బ్యానర్ తో భాగస్వామ్యం పెట్టేసుకుంది. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం కల్కి 2898 ఏడి. మతిపోయే ఓపెనింగ్స్ తో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ విజువల్ గ్రాండియర్ కు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భారీ వసూళ్లు కనిపిస్తున్నాయి.

కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ కి నార్త్ లో ఎలాంటి బ్రాండ్ లేదు. ఎవడే సుబ్రమణ్యం, మహానటిలు వాళ్లకు రీచ్ కాకపోవడమే దానికి కారణం. అయినా సరే ప్రభాస్ ఇమేజ్ తో పాటు తనేం చెప్పాలనుకున్నాడో ట్రైలర్ లో చూపించిన విధానం ప్రేక్షకుల్లో హైప్ తీసుకొచ్చింది. ది రాజా సాబ్ తర్వాత ప్రభాస్ చేయబోయే చిత్రం స్పిరిట్. సందీప్ వంగా ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో హీరో క్యారెక్టరైజేషన్ గురించి చూచాయగా చెబుతూ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు. వయొలెంట్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ ని ఎప్పుడూ చూడని రేంజ్ లో ప్రెజెంట్ చేస్తానని స్క్రిప్ట్ స్టేజిలోనే అంచనాలు పెంచుతున్నాడు.

ఇప్పుడే ఇలా ఉంటే స్పిరిట్ రిలీజయ్యే సమయానికి బాహుబలి హీరో, యానిమల్ డైరెక్టర్ కలయిక అనే ట్యాగ్ వందల కోట్ల రూపాయల బిజినెస్ ని వెల్లువలా తెచ్చి పెడుతుంది.  ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా దీని మీదే ఒకే స్థాయి బజ్ వచ్చేస్తుంది. సందీప్ వంగా కల్కికి జరుగుతున్నది చూస్తుంటాడు కాబట్టి తన మీద బరువు ఏ స్థాయిలో ఉండబోతోందో అర్ధమయ్యే ఉంటుంది. డిసెంబర్ లోగా రాజా సాబ్ పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ ఎవరితో చేస్తాడనే క్లారిటీ ఇంకా లేదు. స్పిరిట్, హను రాఘవపూడి, సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం, కల్కి 2 ఉన్నాయి. ఏది ముందో తేలాలంటే వేచి చూడాలి.