పుష్ప 2 ది రూల్ ఆగస్ట్ రేసు నుంచి తప్పుకోవడం ఆలస్యం బంగారం లాంటి ఆ డేట్ ని కైవసం చేసుకోవాలని ఇతర దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ముందు జాగ్రత్తగా రెండు చిన్న సినిమాలు ఆయ్, 35 చిన్న కథ కాదు ఆల్రెడీ అఫీషియల్ గా ప్రకటించుకున్నాయి. వీటికన్నా ముందుగా అనౌన్స్ చేసుకున్న డబుల్ ఇస్మార్ట్ మీదున్న క్రేజ్ తెలిసి కూడా ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. బహుశా వాయిదా పడొచ్చనే బలమైన నమ్మకమేమో. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాధ్ మాత్రం ధృడ సంకల్పంతో ఎలాగైనా టార్గెట్ ని అందుకోవాలని షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా విక్రమ్ తంగలాన్ సైతం ఆగస్ట్ 15 రావొచ్చని కోలీవుడ్ అప్ డేట్. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ డ్రామాలో చియాన్ ఎప్పుడూ లేనంత విచిత్రమైన గెటప్ తో శరీరం, ఆహార్యం రెండూ మార్చుకుని చాలా కష్టపడ్డాడు. బ్రిటిషర్ల కాలానికి చెందిన ఒక అడవి జాతి మనిషిగా హింసాత్మకంగా ఉండే డిఫరెంట్ రోల్ చేశాడు. నిజానికిది ఎప్పుడో జనవరిలో రిలీజ్ కావాల్సింది. నిర్మాణాంతర కార్యక్రమాలు ఆలస్యం కావడంతో వాయిదా వేసుకుంటూ వెళ్లారు. చూస్తూ చూస్తూ ఆరు నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు పుష్ప స్లాట్ దొరికింది కాబట్టి వచ్చేయాలని చూస్తున్నారు.
ఒకవేళ తంగలాన్ రావడం కన్ఫర్మ్ అయితే డబుల్ ఇస్మార్ట్ కు ఇతర భాషల్లో ఇబ్బందవుతుంది. ఆయ్, 34 చిన్న కథ కాదుకు సైతం చిక్కులు తప్పవు. విక్రమ్ కు ఇక్కడ ఇంతకు ముందు స్థాయిలో మార్కెట్ లేకపోయినా తంగలాన్ మీద ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ వచ్చాక హైప్ ఊహించని విధంగా పెరుగుతుందని ఇన్ సైడ్ టాక్. అయినా ముందే అనౌన్స్ చేసుకోకుండా ఇప్పుడు తగుదునమ్మా అంటూ ఇతర భాషల సినిమాలకు కాంపిటీషన్ వెళ్లడం ఏమిటనే ప్రశ్న తలెత్తడం సహజం. ప్యాన్ ఇండియా కాలంలో ఎవరూ మాట మీద ఉండే పరిస్థితి ఎంత మాత్రం కనిపించడం లేదు.