కరోనా దెబ్బకు 2020లో సినిమా స్క్రీన్లు వెలవెలబోయాయి. సంక్రాంతికి అదిరిపోయే ఆరంభం దక్కింది కానీ.. ఆ తర్వాత ఎన్నో అంచనాలు పెట్టుకున్న వేసవి సీజన్‌ను కరోనా పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఆ తర్వాత సీజన్లకూ పంచ్ పడింది. దసరా, దీపావళి మీద పెద్దగా ఆశలేమీ లేవు. ఆ సమయానికి థియేటర్లు తెరుచుకున్నా అవి పూర్తిగా నిండే అవకాశం ఎంతమాత్రం లేదు.
ఇంతకుముందు సంక్రాంతి మీద ఆశలుండేవి కానీ.. వాటి మీద కూడా నెమ్మదిగా ఆశలు సన్నగిల్లుతూ వచ్చాయి. ఆ పండక్కి పెద్ద సినిమాలేవీ వచ్చే అవకాశం లేదన్న సంకేతాల నేపథ్యంలో ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. ‘ఆచార్య’ వేసవికి వాయిదా పడగా.. ‘రాధేశ్యామ్’ కూడా ఆ సీజన్‌నే టార్గెట్ చేసింది. ‘వకీల్ సాబ్’ విషయంలోనూ స్పష్టత లేకపోయింది. చిన్న, మీడియం రేంజ్ సినిమాలతోనే సరిపెట్టుకోక తప్పదనే అభిప్రాయం వినిపించింది.
కానీ కొంత విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు సంక్రాంతి సందడి గురించి చర్చలు మొదలయ్యాయి. ఆ పండక్కి సందడి తక్కువేమీ ఉండదని అంటున్నారు. అక్టోబర్లో థియేటర్లు తెరుచుకోవడం ఖాయమన్న అంచనాతో ఉన్న సినీ జనాలు.. మొదట డల్లుగా నడిచినప్పటికీ క్రిస్మస్ సీజన్‌కు పరిస్థితులు మెరుగు పడతాయని అంచనా వేస్తున్నారు. సంక్రాంతికి పూర్తి స్థాయిలో థియేటర్లు నడుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే ‘వకీల్ సాబ్’తో పాటు ‘కేజీఎఫ్-2’, ‘క్రాక్’ చిత్రాలు సంక్రాంతికి రావచ్చని అంటున్నారు.
‘కేజీఎఫ్’ షూటింగ్ గత నెలలోనే ఆరంభం కాగా.. ‘వకీల్ సాబ్’, ‘క్రాక్’ చిత్రాలు కూడా ఇంకొన్ని రోజుల్లోనే తిరిగి సెట్స్ మీదికి వెళ్లనున్నాయి. వచ్చే నెలలోనే వీటి చిత్రీకరణ పూర్తవుతుందని అంటున్నారు. ఫస్ట్ కాపీలు రెడీ చేసి పెట్టుకుంటే.. పరిస్థితులు చక్కబడితే సంక్రాంతికి వీటిని రేసులో నిలపొచ్చన్నది ఆశ. ఏమవుతుందో చూడాలి మరి.