ప్యాన్ ఇండియా సినిమాలు నిశ్చింతగా ఉండొచ్చు

పిండి కొద్ది రొట్టె అని పెద్దలు ఊరికే అనలేదు. రోడ్డు మీద తోపుడు బండి మీద పాప్ కార్న్ పది రూపాయలకు దొరుకుతుంది. అదే ఖరీదైన మల్టీప్లెక్సులో మూడు వందలు దాటేస్తుంది. ఇది తప్పని కోర్టు కూడా అనదు. అదే తరహాలో పల్లె వెలుగుప్రయాణానికి, గరుడ లగ్జరి బస్సు జర్నీ చార్జీలో బోలెడు వ్యత్యాసం ఉంటుంది . సినిమాలకూ ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా లార్జర్ ధాన్ లైఫ్ కాన్సెప్ట్ తో వందల కోట్ల రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు పెట్టే ప్యాన్ ఇండియా మూవీస్ ని మాములు టికెట్ ధరలతో చూడటం అన్ని వేళలా సాధ్యం కాదు. నిర్మాత పెట్టుబడి కోణంలో ఎంత మాత్రం క్షేమకరం కాదు.

అందుకే టికెట్ రేట్ల పెంపు అనేది స్వాగతించాల్సిన నిర్ణయం. కల్కి 2898 ఏడికి ఏపీ గవర్నమెంట్ 125, 75 రూపాయల పెంపుకి అనుమతి ఇవ్వడంతో డిస్ట్రిబ్యూటర్ వర్గాల ఆనందం అంతా ఇంతా కాదు. గత వైసిపి పాలనలో కేవలం రాజకీయ కారణాలతో భీమ్లా నాయక్ టికెట్లను పది రూపాయలకు అమ్మించినప్పుడు వాళ్ళు చూసిన నరకం అందరూ చూసిందే. ఇప్పుడు పవన్ డిప్యూటీ సిఎం. జనసేన నేత కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్. దీంతో కల్కికి దారి సుగమం అయ్యింది. నిర్మాత కోరుకున్న వెసులుబాటు సంపూర్ణంగా దక్కింది. తెలంగాణ కంటే టికెట్ ధర తక్కువే కాబట్టి ఆక్షేపించడానికేం లేదు.

రాబోయే ప్యాన్ ఇండియా సినిమాలకు ఈ పరిణామం పెద్ద ఊరట. పుష్ప 2 ది రూల్, గేమ్ ఛేంజర్, ఓజి, ది రాజా సాబ్, బాలయ్య 109, దేవర లాంటి ఎన్నో చిత్రాలకు ధైర్యం వచ్చేస్తుంది. బడ్జెట్ కాస్త ఎక్కువ ఖర్చు పెట్టినా రికవరి అయ్యే అవకాశాలు పెరిగాయి కాబట్టి ప్రొడ్యూసర్లు మరింత నిశ్చింతగా ఉంటారు. ముఖ్యంగా ఓపెనింగ్స్ విషయంలో ఈ చర్య కీలకంగా మారుతుంది. టికెట్ ధర ఎక్కువనుకునే ప్రేక్షకులకు రెండు వారాలు ఆగే ఆప్షన్ ఎలాగూ ఉంది కాబట్టి కల్కి 2898 ఏడి పెంపు అతిగా ఆలోచించే ఇష్యూ కాదు. ఏది ఏమైనా అయిదేళ్ళ పరిశ్రమ నిరీక్షణకు ఫలితం దక్కింది.