కమల్ హాసన్ వ్యాఖ్యల దుమారం

తమిళనాడు రాజకీయ ఉద్ధండులు జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు కాలం చేశాక నెలకొన్న రాజకీయ శూన్యతను భర్తీ చేద్దామని భారీ అంచనాల మధ్య కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లో అడుగు పెట్టిన లోక నాయకుడు.. ఎంత ఘోరంగా విఫలమయ్యారో తెలిసిందే. ఆయన పార్టీ పోటీ చేసిన ఏ ఎన్నికల్లోనూ ఒక్క అభ్యర్థి కూడా విజయం సాధించలేదు. చివరగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడంతో ఆయన రాజకీయంగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. అలా అని ఆయన పార్టీని పూర్తిగా మూసేయలేదు. అప్పుడప్పుడూ కొన్ని కార్యకలాపాలేవో చేస్తున్నారు.

ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో అధికార డీఎంకేకు ఆ పార్టీ మద్దతు ఇచ్చింది. తరచుగా స్టాలిన్ ప్రభుత్వానికి ఆయన మద్దతుగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే ఈ క్రమంలో కమల్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి.

తమిళనాడులోని కళ్లకురిచి అనే ప్రాంతంలో ఇటీవల కల్తీ మద్యం తాగి దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై కమల్ తాజాగా స్పందించారు. ఐతే ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి వెనకేసుకొచ్చే క్రమంలో కమల్ చేసిన కామెంట్ల మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన ఆ ప్రాంతంలో కల్తీ మద్యం తయారవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించకుండా.. ప్రజలు మద్యం తాగే అలవాటును తప్పుబట్టాడు. అకేషనల్ డ్రింకింగ్ వరకు ఓకే కానీ.. అతిగా మద్యం తాగితే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని ఆయనన్నారు. మద్యం తాగే వారిని నియంత్రించేలా రిహాబిలిటేషన్ సెంటర్లు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు.

ఐతే వేరే సందర్భంలో ఇవన్నీ చెబితే ఓకే కానీ.. కల్తీ మద్యం వల్ల పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉండగా.. ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పుబట్టకుండా జనాన్ని తప్పుబడితే ఎలా అంటూ ఆయన మీద సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. కమల్ రాజకీయంగా ఎందుకు విఫలమయ్యాడో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.