ప్రభాస్ ఫ్యాన్స్ క్షమించండి – అమితాబ్

ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా విపరీతమైన అంచనాలు మోస్తున్న కల్కి 2898 ఏడి ఇంకో మూడు రోజులు గడిస్తే చాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో బుక్ మై షో, పేటిఎంలు హోరెత్తిపోతుండగా కౌంటర్ సేల్స్ మొదలుపెట్టిన థియేటర్లు, మల్టీప్లెక్సుల దగ్గర జనం బారులు తీరుతున్నారు. మరోవైపు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు టికెట్ల కోసం ఫోన్ కాల్స్ ఎత్తలేక ఒత్తిడికి గురవుతున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో పరిస్థితి చెప్పనక్కర్లేదు. తలుపు దగ్గర టికెట్లు చెక్ చేసే స్టాఫ్ సైతం సెలబ్రిటీగా ఫీలయ్యే అరుదైన క్షణాలు చూస్తున్నాం.

ఇదిలా ఉంచితే ఇందులో నటించడం తనకెంత ఎగ్జైట్ మెంట్ కలిగిస్తోందో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పదే పదే తన మాటలు, చేతల ద్వారా స్పష్టం చేస్తున్నారు. టీమ్ తో కలిసి చేసిన ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనను మనస్ఫూర్తిగా క్షమించాలని, ఎందుకంటే వాళ్ళ హీరోని ఎత్తి పడేసి కొట్టే సన్నివేశాలు ఇందులో ఉన్నాయని అనడం ఆయన సంస్కారాన్ని, చమత్కారాన్ని సూచిస్తోంది. ఈ ఫైట్ కి సంబంధించిన రెండు మూడు షాట్స్ ని ట్రైలర్ లో గమనించవచ్చు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ డార్లింగ్ మొహమాటాన్ని అమితాబ్ చిన్నపాటి ర్యాగింగ్ చేయడం చూశాం.

గంటల తరబడి ప్రోస్తటిక్స్ మేకప్ వేసుకుని చాలా కష్టం అనిపించినప్పటికీ కల్కి లాంటి కథ, నాగఅశ్విన్ లాంటి విజనరితో పని చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని అమితాబ్ పేర్కొన్నారు. ప్రభాస్ ని మాట్లాడించే ప్రయత్నంలో భాగంగా బిగ్ బి తీసుకున్న చొరవ అంతా ఇంతా కాదు. అశ్వద్ధామగా సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా చాలా కీలకమైన పాత్ర పోషించిన అమితాబ్ సైరా కన్నా ఎక్కువ నిడివి ఉన్న పాత్రలో ఇందులో పోషించినట్టు తెలిసింది. ముఖ్యంగా ఆయనకు, ప్రభాస్ కు మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలు త్రీడి చూస్తే వచ్చే కిక్ మాములుగా ఉండదట.