అనుకున్న దానికన్నా భారీగా కల్కి 2898 ఏడి అడ్వాన్స్ బుకింగ్స్ హోరెత్తిపోతున్నాయి. ఇప్పటిదాకా సౌత్ ఇండియాకు సంబంధించి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. పూర్తి స్థాయిలో స్క్రీన్లు పెట్టకపోయినప్పటికీ ఉన్నవాటిలోనే క్షణాల్లో హౌస్ ఫుల్స్ పడుతున్నాయి.. గంటకు 5 వేల టికెట్లతో మొదలుపెట్టి ప్రస్తుతం ఆ నెంబర్ యాభై వేలకు దగ్గర్లో ఉంది. డేట్ మారేకొద్దీ ఈ నెంబర్ మరింత భారీగా ఉండనుంది. చాలా మల్టీప్లెక్సులకు బుక్ మై షో, పేటిఎంలో సర్వర్ క్రాష్ అయిన మెసేజులు ఉండటంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతానికి హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉదయం 5 గంటల నుంచి షోలు అందుబాటులో ఉంచారు. అర్ధరాత్రి స్పెషల్ ప్రీమియర్లు దాదాపు లేనట్టుగానే కనిపిస్తోంది. ఏపీకి సంబంధించిన అనుమతులు రేపు వచ్చే అవకాశాలు ఉండటంతో ఏ నిమిషమైనా వాటి సేల్స్ ఊపందుకుంటాయి. జిఓ రావడమే ఆలస్యం. గతంలో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కు సైతం ఇదే తరహా బుకింగ్స్ జరిగితే బుక్ మై షో సర్వర్ క్రాష్ కావడం సంచలనం రేపింది. దానికన్నా భారీ అంచనాలు మోస్తున్న కల్కి 2898 ఏడి అంతకు మించి భీభత్సం సృష్టించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని బయ్యర్ల టాక్
టికెట్ రేటు 375 నుంచి 410 రూపాయల దాకా ఉన్నా సరే ఈ స్థాయిలో బుకింగ్స్ జరగడం చూస్తే ప్రభాస్ క్రేజ్, ప్రాజెక్టు మీద ముందు నుంచి నెలకొన్న అంచనాలకు అద్దం పడుతోంది. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం థియేటర్లు జనంతో పోటెత్తడం ఖాయం. గురువారం రిలీజ్ కాబట్టి నాలుగు రోజులు అన్ని చోట్ల కిక్కిరిసిపోతున్న పబ్లిక్ ని చూడొచ్చు. సంక్రాంతి లాంటి సీజన్ కాకపోయినా ప్రభాస్ మూవీ ఎప్పుడొస్తే అప్పుడే పండగనే రేంజ్ లో హడావిడి జరుగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే మంగళ, బుధవారాల్లో జరిగే టికెట్ల అమ్మకాలు ఏ స్థాయి రికార్డులు సృష్టిస్తాయో ముందే ఊహించడం కష్టం.