మాములుగా సినిమా పరిశ్రమకు రాజకీయాలకు అంతర్గతంగా ఎంత సంబంధాలు ఉన్నా లేకపోయినా వాటిని బహిర్గత పరుచుకునేందుకు హీరోలు, నిర్మాతలు, దర్శకులు అంతగా ఇష్టపడరు.
అందుకే ఏదైనా కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పుడు ఎవరికి వారు వెళ్లి విడిగా శుభాకాంక్షలు చెప్పడం తప్పించి అంతకు మించి సెలబ్రేషన్లు చేసిన దాఖలాలు చాలా అరుదు. దాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సమూలంగా మార్చేస్తోంది.
ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జనసేన బిజెపి కూటమి విజయాన్ని పురస్కరించుకుని ఇండస్ట్రీతో పాటు మీడియాకు పెద్ద పార్టీ ఇవ్వడం సంచనలమే.
పీపుల్స్ మీడియా అధినేత టిజి విశ్వప్రసాద్ కి పలురకాలుగా ఈ సక్సెస్ ఆనందాన్ని ఇస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ బ్రో సమయంలో వైసిపి నేతలు ఉద్దేశపూర్వకంగా దాని మీద చెడు ప్రచారం చేయడమే కాక హీరో రెమ్యునరేషన్ గురించి కొందరు మంత్రులు తప్పుడు వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
ఒక మినిస్టర్ ఏకంగా సినిమా ఫ్లాప్ అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ రివ్యూ ఇచ్చారు. దానికి విశ్వప్రసాద్ ఘాటుగానే సమాధానం ఇచ్చారు. మరో కారణం స్వయానా తన బంధువు టిజి వెంకటేష్ కుమారుడు టిజి భరత్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి అందుకోవడం సంతోషాన్ని రెట్టింపు చేసింది.
వ్యక్తిగతంగా ఆస్వాదించడానికి బదులు లక్షలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఈవెంట్ చేయడమంటే భేషైన నిర్ణయమే. ప్రచార సమయంలో జగన్ ని గద్దె దింపుతానని పవన్ కళ్యాణ్ చేసిన చేసిన శపథాన్ని స్టేజి మీద డాన్సు రూపంలో ప్రదర్షింపజేయడం చూస్తే విశ్వప్రసాద్ ఎంత బలంగా కూటమి బ్లాక్ బస్టర్ ని ఎంజాయ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
గతంలో సిఎంలకు టాలీవుడ్ తరఫున సన్మానాలు జరిగాయి కానీ ఇంత గ్రాండ్ గా వేడుక జరగడం మాత్రం ఇదే మొదటిసారని చెప్పాలి. వీటికి తోడు జనసేనకే సినిమాటోగ్రఫీ శాఖ దక్కడం మంచి రోజులు వచ్చాయనే మాటకు సూచకంగా భావిస్తున్నారు.