క‌ల్కికి బెంబేలెత్తించే టికెట్ రేట్లు

అస‌లే ప్ర‌భాస్ సినిమా.. అందులో అమితాబ్ బ‌చ్చ‌న్, దీపికా ప‌దుకొనే, క‌మ‌ల్ హాస‌న్ లాంటి భారీ తారాగ‌ణం.. బ‌డ్జెట్టేమో 700 కోట్లు.. విజువ‌ల్స్ చూస్తే హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం త‌క్కువ‌గా లేవు. ఇలాంటి సినిమా అంటే టికెట్ రేట్ కొంచెం ఎక్కువైనా ప్రేక్ష‌కులు వెనుకాడ‌రు.

మామూలుగానే పెద్ద సినిమాల‌కు రేట్లు పెంచుతారు కాబ‌ట్టి.. క‌ల్కి విష‌యంలోనూ ఎక్కువ రేట్లు పెట్టి టికెట్లు కొన‌డానికి ప్రేక్ష‌కులు రెడీగానే ఉన్నారు. ఐతే ఈ చిత్రానికి మామూలుగా పెద్ద సినిమాల‌కు పెట్టేదానికంటే ఎక్కువ ధ‌ర‌లే పెట్టాల్సి ఉంటుంది. తెలంగాణ వ‌ర‌కు ఈ సినిమాకు టికెట్ల ధ‌ర‌లు ఖ‌రార‌య్యాయి.

సింగిల్ స్క్రీన్ల‌లో రూ.75, మ‌ల్టీప్లెక్సుల్లో రూ.100 రేట్లు పెర‌గ‌నున్నాయి. రెగ్యుల‌ర్ షోల వ‌ర‌కు. ప్రీమియం సింగిల్ స్క్రీన్ల‌కు ట్యాక్సుల‌తో క‌లిపి రూ.265, మ‌ల్టీప్లెక్సుల‌కు రూ.413గా రేట్లు ఫిక్స్ చేశారు. ఐతే క‌ల్కి త్రీడీ సినిమా కాబ‌ట్టి త్రీడీ గ్లాస్‌ల‌కు అద‌న‌పు ధ‌ర చెల్లించాల్సి ఉంటుంది.

హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్స్‌లో టాప్ క్లాస్ త్రీడీ గ్లాసెస్‌కు రూ.100 దాకా తీసుకుంటారు. అంటే క‌ల్కి సినిమాను అక్క‌డ చూడాలంటే 513 రూపాయ‌లు పెట్టాల్సి ఉంటుంది. ఇదిలా ఉండ‌గా.. క‌ల్కికి తెలంగాణ‌లో తెల్ల‌వారుజామున 5.30కి ప్రిమియ‌ర్ షోలు వేయ‌బోతున్నారు. మామూలుగా తెల్ల‌వారుజామున‌ షోల‌కు రెగ్యుల‌ర్ రేట్లు ఉంటాయి. కానీ క‌ల్కికి మాత్రం ఐదున్న‌ర షోల‌కు స్పెష‌ల్ రేట్లు పెడుతున్నారు. దీని ప్ర‌కారం సింగిల్ స్క్రీన్లు, మ‌ల్టీప్లెక్సులు అన్నింటికీ క‌లిపి ఏక‌మొత్తంగా రూ.200 అద‌న‌పు రేటు పెట్టేశారు.

సింగిల్ స్క్రీన్ ధ‌ర రూ.377 కాగా.. మ‌ల్టీప్లెక్స్ టికెట్ రేటు 495గా  ఉండ‌బోతోంది. క‌ల్కికి ఉన్న క్రేజ్ దృష్ట్యా హైద‌రాబాద్‌లో ఉన్న తెలంగాణలో ఉన్న ప్ర‌తి థియేట‌ర్లో ఐదున్న‌ర‌కు షో ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఆ షో చూడాలంటే ప్రేక్ష‌కుల జేబుల‌కు బాగానే చిల్లు ప‌డుతుంది.

ఈ రేట్లు మ‌రీ ఎక్కువ అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న‌ప్ప‌టికీ.. క‌ల్కి స్థాయి సినిమాకు అంత రేటు పెట్టొచ్చ‌ని, అందుకు త‌గ్గ వినోదాన్ని, ప్ర‌త్యేక అనుభూతిని సినిమా ఇస్తుంద‌నే ఆశించ‌వ‌చ్చు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబంధించి ఇంకా టికెట్ల ధ‌ర‌లు ఖ‌రార‌వ్వ‌లేదు.