ప్రభాస్ భయం.. బాక్సాఫీస్ ఖాళీ

ఓ పెద్ద సినిమా విడుదలవుతోందంటే.. ముందు, వెనుక వారాల్లో పేరున్న చిత్రాలను రిలీజ్ చేయడానికి భయపడతారు. ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్‌లో అదే పరిస్థితి కనిపిస్తోంది. గత మూడు వారాల్లో వారానికి మూడు చొప్పున్న పేరున్న సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులను మెప్పించాయి కూడా. కానీ ఈ వారం మాత్రం సరైన సినిమాలు లేక బాక్సాఫీస్ వెలవెలబోయే పరిస్థితి కనిపిస్తోంది. పేరుకు చాలా సినిమాలు రిలీజవుతున్నాయి కానీ.. వాటి గురించి జనాలకు అసలు పట్టింపే లేదు.

ఉన్నంతలో కొంచెం తెలిసిన ముఖాలున్న మూవీ అంటే.. ‘నింద’నే. ‘హ్యాపీ డేస్’ ఫేమ్ వరుణ్ సందేశ్ చాన్నాళ్ల తర్వాత హీరోగా నటించిన చిత్రమిది. ప్రోమోలు చూస్తే ఇదొక థ్రిల్లర్ మూవీలా కనిపిస్తోంది. ఐతే రిలీజ్ ముందు అయితే ఈ సినిమా అంతగా జనాల దృష్టిని ఆకర్షించడం లేదు. టాక్ బాగుంటే ఏమైనా దాని వైపు చూస్తారేమో చూడాలి.

ఇక ఈ వారం బరిలో ఉన్న వేరే చిత్రాల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. చైతన్యరావు-హెబ్బా పటేల్ నటించిన ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌’తో పాటు వెన్నెల కిషోర్ ముఖ్య పాత్ర చేసిన ‘ఓఎంజీ’.. ఇంకా సీతారామ వైభోగమే, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సందేహం, పద్మవ్యూహంలో చక్రధారి లాంటి సినిమాలు చాలానే రిలీజవుతున్నాయి ఈ వారం. ఇవన్నీ రిలీజవుతున్నాయి అంటే రిలీజవుతున్నాయి అనిపించే చిత్రాలే.

‘కల్కి’ తర్వాతి వారాంతంలో కూడా పేరున్న సినిమాలు రిలీజయ్యే సంకేతాలు కనిపించడం లేదు. ఈ వారంలో మాదిరి చిన్న సినిమాలు కూడా ఏవీ షెడ్యూల్ కాలేదు ఆ వీకెండ్‌కు, కల్కి టాక్‌ను బట్టి ఏమైనా పరిస్థితి మారొచ్చు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల దృష్టంతా ‘కల్కి’ మీదే ఉంది. ‘కల్కి’ మీద డబ్బులు కొంచెం ఎక్కువే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండడంతో రెగ్యులర్ సినీ గోయర్స్ కూడా ఈ వారం సినిమాలను ఏమేర పట్టించుకుంటారన్నది సందేహమే.