గత వారం విడుదలైన మహారాజ డబ్బింగ్ మూవీనే అయినప్పటికీ హరోం హర లాంటి స్ట్రెయిట్ సినిమాల పోటీని తట్టుకుని విజేతగా నిలిచింది. రిలీజ్ రోజు ఉదయం పెద్దగా కనిపించని జనంతో మొదలుపెట్టి క్రమంగా క్రౌడ్ పెరుగుతూ వీకెండ్ లో హౌస్ ఫుల్స్ బోర్డులు చూడటం ఒక్క విజయ్ సేతుపతి వల్లే అయ్యింది. ఇలాంటి అనూహ్య ఫలితాన్ని ఊహించని టీమ్ ఇక్కడ వస్తున్న రెస్పాన్స్ చూసి ఉన్నఫళంగా హైదరాబాద్ వచ్చేసి మరీ స్పెషల్ ప్రమోషన్లు చేసింది. హీరో, దర్శకుడు, క్రూతో సహా అందరూ హాజరై తమ వంతుగా పబ్లిసిటీని పుష్ చేయడానికి కృషి చేశారు.
ఈరోజుతో మహారాజ రెండో వారంలో అడుగు పెట్టింది. ఇవాళ ఒక్క తెలుగులోనే పదకొండు దాకా కొత్త చిత్రాలు థియేటర్లలో అడుగుపెట్టాయి. అన్ని వివిధ జానర్లకు సంబంధించినవే అయినప్పటికీ ప్రేక్షకులకు దేనిమీద కనీస ఆసక్తి కనిపించడం లేదు. దీంతో బయ్యర్లు సైతం కనీస ఓపెనింగ్స్ అయినా వస్తాయా రావా అనే అనుమానంతో ఎదురు చూస్తున్నారు. నింద, ఓ మంచి ఘోస్ట్, హానీమూన్ ఎక్స్ ప్రెస్ లాంటి వాటిలో కాస్త ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులే ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేదు. అనూహ్యమైన టాక్ వస్తే తప్ప సాయంత్రానికో రెండో రోజో పికప్ ని చూడలేం.
ఇదే మహారాజకు మంచి అవకాశంగా మారనుంది. జూన్ 27 కల్కి వచ్చే దాకా ఇంకో ఆరు రోజులు స్టడీ రన్ దక్కే ఛాన్స్ దొరికింది. దాదాపు అన్ని కేంద్రాల్లో మెయిన్ స్క్రీన్లు మహారాజకే కొనసాగుతున్నాయి. రికార్డులు బద్దలయ్యే వసూళ్లు రోజూ కనిపించకపోయినా కౌంటర్ బుకింగ్స్ ద్వారా జరుగుతున్న అమ్మకాలు మిగిలిన సినిమాల కంటే చాలా బెటర్ గా ఉన్నాయి. బ్రేక్ ఈవెన్ అయిపోయింది మొదటివారంలోనే కాబట్టి ఇప్పుడొస్తున్న లాభాలతో నిర్మాత సేఫ్ జోన్ ఎప్పుడో దాటిపోయాడు. కమర్షియల్ అంశాలు లేని ఒక క్రైమ్ థ్రిల్లర్ ఇంత విజయం నమోదు చేయడం అంటే విశేషమే.