జూన్ 21 – చిన్న సినిమాల ముప్పేటదాడి

వచ్చే వారం కల్కి 2898 ఏడి విడుదల నేపథ్యంలో జూన్ 21 ఇమేజ్ ఉన్న సినిమాలేవీ రిలీజుకు సాహసించడం లేదు. తక్కువ గ్యాప్ లో సునామిలా విరుచుకుపడే ప్రభాస్ ని తట్టుకోవడం కష్టం కాబట్టి మీడియం రేంజ్ హీరోలు సైతం నో ఫ్రైడే అనేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. వరుణ్ సందేశ్ నటించిన ‘నింద’ వాటిలో కాస్త చెప్పుకోదగినది. టీమ్ నాన్ స్టాప్ గా ప్రమోషన్లు చేస్తోంది. సోషల్ మీడియాలోనూ వీలైనంత ఫోకస్ వచ్చేలా చూస్తున్నారు కానీ అంచనాల పరంగా దీని మీద జనాల దృష్టి పడటం లేదు. ఇది క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందింది.

దెయ్యాల ట్రెండ్ ఈ సంవత్సరం గట్టిగా ఉంది. కొన్ని హిట్టవుతున్నాయి కొన్ని ఫట్ మంటున్నాయి. అయినా తాకిడి ఆగడం లేదు. ‘ఓఎంజి ఓ మంచి ఘోస్ట్’ టైటిల్ తో మరో కామెడీ హారర్ ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. వెన్నెల కిషోర్, నందిత శ్వేతా, షకలక శంకర్ తదితర హాస్య నటులు ఇందులో ఉన్నారు. ఎన్ని ఫ్లాపులు పలకరిస్తున్నా అవకాశాలు దక్కించుకుంటూనే ఉన్న డిజిటల్ స్టార్ చైతన్య రావు, హెబ్బా పటేల్ జోడితో ‘హానీ మూన్ ఎక్స్ ప్రెస్’ వస్తోంది. రాజేంద్రప్రసాద్, సుహాసినిలు కీలక పాత్రల్లో కనిపిస్తారు. యూత్ ని టార్గెట్ చేసుకున్న ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ బరిలో దిగుతోంది.

ఇవి కాకుండా అంతిమతీర్పు, సందేశం, మరణం, పద్మవ్యూహంలో చక్రధారి, ఇట్లు మీ సినిమా, సీతా కల్యాణ వైభోగమే, మరణంలు సై అంటే సై అని పలరించుకుంటున్నాయి. ఇవి సరిపోవన్నట్టు ఉపేంద్ర ఏ, సుధీర్ బాబు ప్రేమకథా చిత్రమ్, కెజిఎఫ్ చాప్టర్ 1 రీ రిలీజ్ తో వస్తున్నాయి. ఓపెనింగ్స్ పరంగా దేని మీద ఆశలు లేవు కానీ మరీ ఇంత మూకుమ్మడిగా దాడి చేయడం వల్ల ప్రయోజనం ఎవరికో అంతు చిక్కడం లేదు. ఎక్స్ ట్రాడినరి టాక్ వస్తే తప్ప ఇవి గట్టెక్కడం కష్టం. అలాంటిది ఇంత కాంపిటీషన్ లో క్లాష్ కావడం అంతు చిక్కనిది. జూన్ 21 వదిలేస్తే మళ్ళీ దగ్గరలో డేట్ కష్టమే మరి.