కల్కి 29898 ఏడి ప్రమోషన్లను వైజయంతి బృందం తీవ్రంగా చేయకపోవడం పట్ల అభిమానులు కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ జూన్ 27న కంటెంటే పబ్లిసిటీ చేస్తుందన్న ధీమా నాగఅశ్విన్ లో కనిపిస్తోంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ విజువల్ వండర్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఆ నమ్మకాన్ని నిజం చేసేలాగే ఉన్నాయి. 2 గంటల 58 నిమిషాల నిడివితో ఫైనల్ వెర్షన్ లాక్ చేసుకున్న కల్కిని ఆద్యంతం కనులవిందుగా తీర్చిద్దారట. ముఖ్యంగా పురాణ పాత్రలను వాడుకుని ఆధునిక కలియుగానికి ముడిపెట్టిన తీరు చిన్నా పెద్దా అందరికీ అర్ధమయ్యే రీతిలో స్పెల్ బౌండ్ అయ్యేలా ఉందట.
క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టు, రెండో భాగానికి ఇచ్చిన లీడ్ ఊహించని స్థాయిలో మతిపోయేలా చేయడం ఖాయమని అంటున్నారు. క్లిఫ్ హ్యాంగర్ తరహాలో చివరిలో వచ్చే స్టార్ క్యామియోకి థియేటర్లు ఊగిపోవడం ఖాయమంటున్నారు. అది ప్రభాసా లేక మరొకరా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పాటలు కొంత మైనసవ్వొచ్చని వినిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి సౌండ్ సిస్టం ఉన్న థియేటర్లో కొత్త అనుభూతినిస్తుందని అంటున్నారు. ఇంటర్వెల్ బ్లాక్, బుజ్జి విన్యాసాలు, భైరవగా ప్రభాస్ ఫైట్లు, అమితాబ్ బచ్చన్ పాత్ర ప్రధాన హైలైట్స్ గా చెబుతున్నారు. కమల్ హాసన్ మాత్రం సర్ప్రైజ్ ప్యాకేజట.
ఇవన్నీ చూస్తుంటే కల్కి 2898 ఏడి హైప్ కు తగ్గట్టే రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకో ఎనిమిది రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో అభిమానుల ఆతృత పీక్స్ కు చేరుకుంటోంది. ఇవాళ ముంబైలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి కొన్ని ప్రత్యేకమైన విశేషాలు ఆశిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వేడుకగా ఉంటుందా లేదానే క్లారిటీ ఇంకా రాలేదు. అమరావతిలో చేస్తారనే టాక్ నిజం కాదని తెలిసింది. ఇంకో మూడు నాలుగు రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టాలని డిస్ట్రిబ్యూటర్లు చూస్తున్నారు కానీ టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి జిఓ రావడం ఆలస్యం అమ్మకాలు మొదలైపోతాయి.