అల్లు అట్లీ కలయిక లేనట్టేనా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ కాంబోలో ముందు అనుకున్న ప్యాన్ ఇండియా మూవీ ఇక ఉండకపోవచ్చనే టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా తిరుగుతోంది. ఓ మూడు నెలల క్రితమే దీనికి సంబంధించిన కథను వండుతున్న అట్లీ ఫైనల్ వెర్షన్ తో బన్నీని మెప్పించలేకపోయాడనే ప్రచారం అంతర్గత వర్గాల్లో ఉంది.

ఇది కాకుండా డైరెక్టర్ గా తన రెమ్యునరేషన్ ని వంద కోట్ల వరకు డిమాండ్ చేయడంతో రిస్క్ అవుతుందని భావించడం వల్లే ప్రాజెక్టు ముందుకు వెళ్లకపోవచ్చని టాక్ ఉంది. నిజానికీ సినిమాకు సంబంధించిన ప్రకటనా అసలు ఏనాడూ రాలేదు. అంత లోలోపలే జరుగుతోంది.

పుష్ప 2 ది రూల్ ఇంకా ఆలస్యం అవుతుండటంతో తర్వాత చేయబోయే సినిమాల గురించి బన్నీ ముందు పలు ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించేలా అడుగులు వేయడం. కానీ స్క్రిప్ట్ సిద్ధమైతే తప్ప సెట్స్ పైకి వెళ్ళదు. గుంటూరు కారం అనుభవం తర్వాత గురూజీ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రెండో ఛాయస్ సందీప్ రెడ్డి వంగా. అయితే అతను ప్రభాస్ స్పిరిట్ అయిపోగొట్టాకే అందుబాటులోకి వస్తాడు. ఎంతలేదన్నా దీనికో రెండు సంవత్సరాలు కావాలి. ఏదైనా అనూహ్యంగా జరిగితే తప్ప ఈ ప్లానింగ్ లో మార్పు ఉండదు.

అలాంటప్పుడు అట్లీకి బన్నీ నో చెబితే బాక్సాఫీస్ పరంగా గ్యాప్ వచ్చేస్తుంది. అయితే పుష్ప 3 ది రోర్ తీసే ప్రతిపాదన సుకుమార్ వద్ద ఉంది. ఇది ఓకే అనుకుంటే అల్లు అర్జున్ ఇంకొంత కాలం దీని కోసం పని చేయాల్సి ఉంటుంది. రామ్ చరణ్ తో మరో సినిమా ఒప్పుకున్న సుకుమార్ దాని గురించి టెన్షన్ గా లేడు. ఎందుకంటే చరణ్ గేమ్ ఛేంజర్ పూర్తి చేశాక బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సి 16 మొదలుపెట్టాలి. 2026లో రిలీజ్ ఉంటుంది. సో సుకుమార్ ఆలోగా బన్నీ ఓకే అనుకుంటే పుష్ప 3 తీయొచ్చు. కానీ వాళ్ళుగా చెప్పేదాకా ఏదీ ఖరారుగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. చూడాలి ఏం జరగనుందో.