అకీరా ఎంట్రీకి పెరుగుతున్న డిమాండ్

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఊపిరి సలపలేనంత బిజీ కావడం కళ్ళముందు కనిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రితో పాటు కీలక శాఖల బాధ్యతలు తన మీద ఉండటంతో హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేయడమే మహా కష్టంగా మారేలా ఉంది. ఇక కొత్త సినిమాలు ఒప్పుకునే ప్రసక్తే ఉండదని పార్టీ వర్గాలు అంటున్నాయి. పైగా కూటమి పాలన కేవలం అయిదేళ్లకే పరిమితమవ్వాలనే లక్ష్యంతో లేదు. సుదీర్ఘ పాలన వైపు అడుగులు వేస్తోంది. తనతో సమానంగా ప్రాధాన్యం ఇస్తున్న చంద్రబాబు నాయుడు నమ్మకానికి తగ్గట్టు జనసేనను మరింత పటిష్టపరిచే ప్రణాళికలు పవన్ వద్ద ఉన్నాయి.

అందుకే ఇప్పుడు పవర్ స్టార్ అభిమానులు చూపులు అకీరానందన్ వైపు వెళ్తున్నాయి. ఎప్పుడూ లేనిది కుర్రాడు గత నెలరోజులుగా పబ్లిక్ లో బాగా ఎక్స్ పోజ్ అవుతున్నాడు. బాబు గెలిచాక ఇంటికి వచ్చిన టైంలో, నరేంద్రమోడీని కలిసేందుకు పవన్ ఢిల్లీకి వెళ్లిన సమయంలో, ఇటీవలే ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రతిచోటా అకీరా కనిపించాడు. ఈ రోజు సుదర్శన్ థియేటర్లో తమ్ముడు రీ రిలీజ్ స్పెషల్ షోకు వస్తే ఫ్యాన్స్ ఒక్కసారిగా చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేశారు. గతంలోనూ చాలాసార్లు వచ్చాడు కానీ ఇలా అభిమానుల మధ్య చిక్కుకుపోవడం ఎప్పుడూ జరగలేదు.

ఈ లెక్కన అకీరా బిగ్ స్క్రీన్ ఎంట్రీకి ముహూర్తం, అవసరం రెండూ వచ్చేసినట్టు ఉన్నాయి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఇప్పటికేకొడుకు రంగప్రవేశం గురించి సన్నితుడైన ఒక అగ్ర నిర్మాతతో మాట్లాడి ఉంచాడట. సరైన కథ, దర్శకుడు దొరికితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. తను ఓకే అనాలే కానీ పెద్ద బ్యానర్లు క్యూ కడతాయి. మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ లాగా ఒక ప్రాపర్ లాంఛ్ కోసం ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. పవన్ ఫుల్ టైం పొలిటిక్స్ లో బిజీ అయిపోయాడు కాబట్టి తండ్రి లెగసి అనే పెద్ద బరువు తన భుజాల మీద ఉంటుంది. అది మోయడం ఛాలెంజే.