వనవాసంలో ‘కన్నప్ప’ అకుంఠిత భక్తి

మంచు విష్ణు కెరీర్ లోనే కాదు మోహన్ బాబు బ్యానర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్ లాంటి ఎందరో దిగ్గజ స్టార్ హీరోలు భాగమైన ఈ విజువల్ వండర్ అత్యధిక భాగం షూటింగ్ విదేశాల్లో చేశారు. త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్న తరుణంలో ఇవాళ హైదరాబాద్ లో టీజర్ లాంచ్ జరిగింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ డ్రామాకు స్టీఫెన్, మణిశర్మలు సంయుక్తంగా సంగీతం సమకూర్చడం విశేషం. మొదటిసారి కన్నప్ప విజువల్స్ ప్రపంచానికి పరిచయమయ్యాయి.

అపురూపమైన వాయు లింగంని తేవడం కోసం బయలుదేరిన దుర్మార్గుడైన కాలముఖ తమ్ముడు తెంకనాతో సహా అడ్డొచ్చిన యాభై మందిని కన్నప్ప (మంచు విష్ణు) ఒక్కడే మట్టుబెడతాడు. వందలాది సైన్యం వచ్చినా ఏమి చేయలేని పరాక్రమవంతుడిని ఒక అడవి బిడ్డ ఊచకోత కోయడం కనివిని ఎరుగని అద్భుత సాహసం. అలాంటి కన్నప్ప మహా శివ భక్తుడు. విల్లంబులు ధరించి వనవాసమే తన నివాసంగా మార్చుకున్న ఈ తిప్పడికి అసలైన అగ్ని పరీక్ష శత్రువుల నుంచి మొదలవుతుంది. భీకరంగా పోరాడుతున్న సమయంలో వాళ్ళు చేసిన దాడికి గరళకంఠుడి సాయం కోరతాడు.

ప్రతి ఫ్రేమ్ ని తీర్చిదిద్దిన విధానం సాంప్రదాయ కన్నప్పను కొత్తగా చూపించేలా ఉంది. ఎప్పుడో దశాబ్దాల నాటి కృష్ణంరాజు గారి భక్త కన్నప్పను మరిపించేలా సరికొత్త టెక్నాలజీని వాడి వినూత్న రీతిలో ఆవిష్కరించారు. కథ గురించి పెద్దగా క్లూస్ ఇవ్వకపోయినా ప్రభాస్ కళ్ళను అలా ఒక చిన్న షాట్ లో చూపించడం దృష్టిలో పడకుండా పోలేదు. శివుడిగా అక్షయ్ కుమార్ చేశారనే హింట్ ఇచ్చారు. మొత్తానికి అంచనాల పరంగా తాను బలమైన పోటీ ఇవ్వబోతున్నాననే సంకేతం కన్నప్ప ఇచ్చేశాడు. కమింగ్ సూన్ అని చెప్పడం చూస్తే 2024లోనే థియేట్రికల్ రిలీజ్ ఉంటుందని అర్థమైపోతుంది.