కల్కి రికార్డుల వేట మొదలు

టాలీవుడ్ నుంచి మరో ప్రపంచ స్థాయి సినిమా సిద్ధమైంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాల తర్వాత ప్రపంచాన్ని ఆశ్చర్యపరచగలదని అంచనాలున్న ఆ చిత్రమే.. కల్కి.

వైజయంతీ మూవీస్ బేనర్ మీద ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రాన్ని ఏకంగా రూ.600 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించారు.

ఇటీవలే రిలీజైన ట్రైలర్ చూస్తే హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తగ్గని విధంగా ‘కల్కి’ ఉంటుందని అర్థమవుతోంది. ప్రేక్షకుల్లో సినిమా మీద ఇప్పటికే ఉన్న అంచనాలు రిలీజ్ దగ్గర పడేసరికి ఇంకా పెరుగుతున్నాయి. ఈ సినిమాకు యుఎస్ సహా పలు దేశాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అక్కడ ప్రి సేల్స్ గట్టిగానే జరుగుతున్నాయి.

యుఎస్‌లో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్ల ప్రి సేల్స్ సాధించిన ఇండియన్ మూవీగా ‘కల్కి’ రికార్డు సృష్టించడం విశేషం. ‘ఆర్ఆర్ఆర్’ పేరిట ఉన్న రికార్డును ఈ చిత్రం బద్దలు కొట్టింది. ‘కల్కి’ ప్రి సేల్స్ మొదలై కొన్ని రోజులే అయింది. ఈ లోపే 1 మిలియన్ డాలర్ల క్లబ్బులోకి అడుగు పెట్టేసింది.

రిలీజ్ లోపే ఈ చిత్రం 2 మిలియన్ మార్కును కూడా అందుకోవడం లాంఛనమే. వీకెండ్లోనే 5 మిలియన్ క్లబ్బులో కూడా అడుగు పెట్టొచ్చు. టాక్ బాగుంటే ‘ఆర్ఆర్ఆర్’ను అధిగమించి ‘బాహుబలి-2’ రికార్డులకు కూడా చేరువగా వెళ్లొచ్చు.

ఈ నెల 27న ‘కల్కి’ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులకు కూడా పాతర వేయడం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రికార్డు స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.