లెజెండరీ కుటుంబంలో విడాకుల చిచ్చు

రెగ్యులర్ గా వాళ్ళ డబ్బింగ్ సినిమాలు రాకపోయినా దివంగత కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ అంటే మనకూ సుపరిచితమే. ఆయన వారసుల్లో శివ రాజ్ కుమార్ ఇటీవలే జైలర్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. రామ్ చరణ్ 16లో కీలక పాత్ర ఒప్పుకోవడం ద్వారా టాలీవుడ్ లో ఫుల్ లెన్త్ రోల్ తో డెబ్యూ చేస్తున్నాడు. అంతకు ముందు గౌతమీపుత్ర శాతకర్ణి బుర్రకథ పాటలో క్యామియో చేయడం గుర్తే. చివరి కొడుకు పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన సమయంలో టాలీవుడ్ జనాలు కూడా బాధ పడ్డారు. అందుకే చివరి చిత్రం జేమ్స్ ని టాక్ తో సంబంధం లేకుండా ఏపీ తెలంగాణలో చూశారు.

ఇక అసలు విషయానికి వద్దాం. శివన్న తమ్ముడు పునీత్ అన్నయ్య రాఘవేంద్ర రాజ్ కుమార్ రెండో కొడుకు యువ రాజ్ కుమార్. ఇటీవలే హోంబాలే ఫిలింస్ నిర్మించిన యువతో సినీ రంగంలో లాంచ్ అయ్యాడు. ఇతని భార్య పేరు శ్రీదేవి భైరప్ప. నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. పెద్దలు ఒప్పుకోకపోతే పునీత్ దగ్గరుండి రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి జరిపించాడు. కట్ చేస్తే ఇప్పుడు యువ, శ్రీదేవి భైరప్ప విడాకుల వ్యవహారం రచ్చకెక్కింది. తన భర్తకు అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

దానికి బదులుగా యువ తరఫున లాయర్ శ్రీదేవినే మరొకరితో సన్నిహితంగా ఉందంటూ అన్న మాటలు మరింత దుమారాన్ని రేపుతున్నాయి. శ్రీదేవి తనను విపరీతంగా హింస పెడుతోందని యువ అంటుండగా, వేరొకరితో సంబంధం వల్లే ఇలా అంటున్నాడని ఆమె రివర్స్ కౌంటర్ వేస్తోంది. ట్విస్టు ఏంటంటే యువకు లైంగిక సమస్య కూడా ఉందని శ్రీదేవి చెప్పడం. ఇదంతా ఎంత దూరం వెళ్తుందో కానీ రాజ్ కుమార్ ని విపరీతంగా అభిమానించే ఫ్యాన్స్ ఈ పరిణామాలు చూస్తూ బాధపడుతున్నారు. తప్పెవరిదో గుర్తించి వీలైనంత త్వరగా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు.