భయమేస్తోందంటున్న సమంత

సాంకేతికత కొత్త పుంతలు తొక్కడం వల్ల ప్రయోజనం ఎంతో నష్టమూ అంతే. ఏ చిన్న అవకాశం దొరికినా టెక్నాలజీని ఉపయోగించుకుని వ్యక్తిగత సమాచారాన్నంతా లాగేసి ఇబ్బంది పెట్టే వ్యక్తులు బాగా పెరిగిపోయారు. ఈ విషయంలో సెలబ్రెటీలైన తమకు కూడా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయని అంటోంది సమంత. నెట్ ఫ్లిక్స్‌లో ఈ మధ్య ‘సోషల్ డైలమా’ అనే డాక్యుమెంటరీ చూశానని.. అది చూసినపుడు చాలా భయం కలిగిందని.. ప్రస్తుతం మన జీవితాలను ‘డేటా’ అనే అంశం శాసిస్తోందని.. వ్యక్తులకు ప్రైవేట్ లైఫ్ అన్నదే లేకుండా పోయిందని ఆమె అంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై సమంత వివరంగా మాట్లాడింది.

ఈ మధ్య కాలంలో తన సోషల్‌ మీడియా అకౌంట్లను హ్యాక్‌ చేయటానికి గట్టిగా ప్రయత్నం జరుగుతోందని సమంత ఆందోళన వ్యక్తం చేసింది. తన ఫోన్‌ నెంబర్‌కు అప్పుడప్పుడూ.. ‘‘మీ అకౌంట్‌లో లాగిన్‌ అవటానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు.. అది మీరేనా?’’ అనే సందేశం వస్తుంటుందని ఆమె చెప్పింది. ఒక్క ఫోన్‌ నెంబర్‌ బయటికి వెళ్తే మన జీవితమే మారిపోతుందని.. ఎవరికైనా నంబర్ ఇస్తే మన వ్యక్తిగత సమాచారాన్ని బయటి వ్యక్తుల చేతుల్లో పెట్టేసినట్లు అవుతోందని ఆమె అంది. గతంలో నేను ఫుడ్ యాప్స్‌లో ఆర్డర్‌ చేసినప్పుడు తన ఒరిజినల్‌ ఫోన్‌ నెంబర్‌ ఇచ్చేసేదాన్నని.. ఆ తర్వాత తనకు రకరకాల ఫోన్‌కాల్స్‌ వచ్చేవని.. ఒక రెస్టారెంట్‌కు ఫోన్‌ చేసి టేబుల్‌ బుక్‌ చేస్తే పది రెస్టారెంట్ల నుంచి ఫోన్లు వచ్చేవని.. ఈ సమస్య అందరికీ ఉంటోందని సమంత చెప్పింది.

క్యాబ్‌ కావాలంటే ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాలి.. ఫుడ్‌ కావాలంటే ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాలి.. షాపింగ్‌కు వెళ్తే ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాలి.. ఇలా ఎక్కడైనా ఒక చోట నెంబర్‌ ఇస్తే చాలు.. తర్వాత పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావని.. ఇదంతా చూస్తే భయమేస్తోందని సమంత అంది. సోషల్‌ మీడియా వల్ల రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. దీని వల్ల మంచి ఎంత ఉందో చెడు అంతే ఉందని.. కోవిడ్ టైంలో ప్లాస్మా దాతలను.. కరోనా సోకిన వ్యక్తి కుటుంబీకులను కలిపేందుకు ఇది మంచి వేదిక అయిందని.. అదే సమయంలో రకరకాల ఫేక్ న్యూస్‌లను వ్యాప్తి చేసి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నదీ సోషల్ మీడియానే అని సమంత అంది.