చాందిని చౌదరి డబుల్ ధమాకా

పేరుకి తెలుగమ్మాయే కానీ సంవత్సరాల ఎదురుచూపు తర్వాత కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు అందుకున్న చాందిని చౌదరికి ఆఫర్లు వస్తున్నాయి కానీ సరైన బ్రేక్ దొరకడం లేదు. గామికి ఎన్ని ప్రశంసలు వచ్చినా అవి అధిక శాతం విశ్వక్ సేన్ అకౌంట్ లోకి వెళ్లిపోయాయి. బాలకృష్ణ 109లో అవకాశం దక్కించుకున్నా అందులో మెయిన్ హీరోయిన్ వేరే. అందం, అభినయం రెండూ ఉన్నప్పటికీ గ్లామర్ విషయంలో వెనుకబడి పోవడం కొంత కారణమేమో అనుకున్నా ఈ వారం ఒకే రోజు రెండు కొత్త సినిమాలతో ప్రేక్షకులను పలకరించనుంచి. చిన్న చిత్రాలే అయినా ప్రమోషన్లు గట్టిగా చేసుకుంటున్నారు.

మొదటిది మ్యూజిక్ షాప్ మూర్తి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ టైటిల్ రోల్ పోషించగా చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపిస్తుంది. కాన్సెప్ట్ వెరైటీగా అనిపిస్తోంది. అంచనాలు పెద్దగా లేవు కానీ టీమ్ మాత్రం పది రోజుల ముందే వైజాగ్ లో ప్రీమియర్ వేసి నమ్మకాన్ని వ్యక్తం చేసింది. రెండోది యేవమ్. లేడీ పోలీస్ గా చాందినిలోని కొత్త పెర్ఫార్మర్ ని బయటికి తీసే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తోంది. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సైకో థ్రిల్లర్ కి నవదీప్ ఒక నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడం గమనార్హం. మ్యూజిక్ షాప్ మూర్తి, యేవమ్ రెండూ జూన్ 14నే థియేటర్లలో అడుగు పెట్టనున్నాయి.

ఇవి బ్రేక్ ఇస్తే సంతోషమే కానీ చిన్న సినిమాల మనుగడ బాక్సాఫీస్ వద్ద బాగా కష్టమైన తరుణంలో అదే రోజు పోటీ తీవ్రంగా ఉంది. సుధీర్ బాబు హరోంహర, విజయ్ సేతుపతి మహారాజకు మంచి పబ్లిసిటీ చేస్తున్నారు. నైజాం ఏరియా హక్కులను మైత్రి లాంటి పెద్ద సంస్థ కొనుగోలు చేసి మంచి రిలీజ్ దక్కేలా చేస్తోంది. మరి చాందిని చౌదరి సినిమాలు వీటిని తట్టుకోవడం అంత సులభంగా ఉండదు. బడ్జెట్, గ్రాండియర్ పరంగా వాటితో పోల్చడానికి ఉండదు. ఫైనల్ గా మాట్లాడాల్సింది కంటెంట్ మాత్రమే. ఏప్రిల్ నుంచి బ్లాక్ బస్టర్ లేని లోటు తీర్చే మూవీ ఏదవుతుందో వేచి చూడాలి.