సౌత్ ఇండియా మొత్తంలో విపరీతమైన డిమాండ్ ఉన్న సంగీత దర్శకుల్లో ముందుగా వినిపించే పేరు అనిరుద్ రవిచందర్. పది కోట్లకు పైగా పారితోషికం డిమాండ్ చేస్తున్నా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారంటే తన ఇమేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా విక్రమ్, జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత గ్రాఫ్ ఇంకా పెరిగింది.
అందుకే దేవర కోసం జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివలు ఏరికోరి తనను తీసుకొచ్చారు. ఇప్పుడు టాపిక్ ఇది కాదు. ఇటీవలే విడుదలైన కమల్ హాసన్ భారతీయుడు 2 సాంగ్స్ గురించి. జూన్ 1 గ్రాండ్ గా జరిగిన ఈవెంట్ లో మొత్తం ఆల్బమ్ ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.
సమస్య ఎక్కడొచ్చిందంటే ఇప్పుడీ పాటలను 1996లో మొదటి భాగానికి కంపోజ్ చేసిన ఏఆర్ రెహమాన్ తో పోల్చడం వల్ల. పాతికేళ్ల క్రితం డీటీఎస్ సాంకేతిక అప్పుడప్పుడే మొగ్గతొడుగుతున్న టైంలో తను ఇచ్చిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆడియో క్యాసెట్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. మ్యూజిక్ లవర్స్ టేప్ రికార్డర్లు అరిగిపోయే దాకా తెగ వినేవారు. అదిరేటి డ్రెస్సు, పచ్చని చిలుకలు, టెలిఫోన్ ధ్వని, తెప్పరిల్లిపోయాక, మాయా మశ్చీంద్ర దేనికవే ఎవర్ గ్రీన్ కంపోజింగ్స్. ఇప్పుడు అనిరుద్ నుంచి ఆ స్థాయి అవుట్ ఫుట్ ఆశిస్తున్నారు.
అయితే ఇద్దరి వర్కింగ్ స్టయిల్ వేరు కనక పోల్చడం సరికాదు కానీ తన మీద ఉన్న అంచనాల బరువు తెలుసు కాబట్టి అనిరుద్ కెరీర్ బెస్ట్ ఇచ్చే దిశగా కంపోజ్ చేయాల్సింది. కానీ ప్రస్తుతం ఆన్ లైన్ రెస్పాన్స్ చూస్తుంటే ఆ స్థాయిలో ఫీడ్ బ్యాక్ కనిపించడం లేదు. ఏఆర్ రెహమాన్ ని అందుకోవడం అంత సులభం కాకపోయినా యువతను వెర్రెక్కిపోయేలా అనిరుద్ ఎన్నోసార్లు చేశాడు. భారతీయుడు 2కి అలా ఆశించడంలో తప్పేం లేదు. ఓ రెండు పాటలు మినహాయించి మిగిలినవాటికి స్పందన అంతంత మాత్రంగా ఉంది. జూలై సినిమా రిలీజయ్యాక స్క్రీన్ మీద చూశాక బెటర్ గా అనిపిస్తాయేమో.