ఇవాళ కన్నుమూసిన మీడియా దిగ్గజం రామోజీరావు నిర్యాణంతో యావత్ పరిశ్రమ వర్గాలు మూగబోయాయి. పత్రికా అధినేతగానే కాకుండా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాల ద్వారా నటీనటులకు కెరీర్ ఇచ్చిన అమోఘ శక్తిగా ఆయన జ్ఞాపకాలను తలచుకుంటున్న వాళ్ళు ఎందరో.
ఆస్కార్ దాకా టాలీవుడ్ సినిమాను తీసుకెళ్లిన దర్శక ధీరా రాజమౌళి సైతం తన కెరీర్ ని టీవీ సీరియల్ తో మొదలుపెట్టింది ఈటీవీలోనే. అకాడెమి మనసులు గెలుచుకున్న ఎంఎం కీరవాణి వచ్చింది ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన మనసు మమతతోనే. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ బ్యానర్ ద్వారా పరిచయం కాకపోయినా ప్రేమించు పెళ్లాడు లాంటి క్లాసిక్ మూవీ నుంచి ఆయనకు రామోజీ సంస్థతో అనుబంధం ఉంది. ఉషాకిరణ్ నుంచి వచ్చిన చివరి సినిమా దాగుడుమూతల దండాకోర్ లో హీరోగా నటించారు.
ఇవాళ నివాళి అర్పించడం కోసం ఫిలిం సిటీకి వచ్చిన రాజేంద్రుడు అన్న మాటలు సూటిగా ఎవరిని ఉద్దేశించినవో వాళ్లకు తగిలేలా ఉన్నాయి. ముదిమి వయసులో నీచమైన రాజకీయాల ద్వారా తనను మనోవేదనకు గురి చేసిన వాళ్ళ అంతం చూసే ఆయన సెలవు తీసుకున్నారని చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
గతంలో మార్గదర్శి విషయంలో జగన్ సర్కారు ప్రవర్తించిన తీరు, కార్యాలయాల మీద అధికారులను పంపి దాడులు చేయించిన వైనం చిట్ ఫండ్స్ మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. పైపెచ్చు కోర్టులు కూడా ఇలా చేయడం పట్ల అక్షింతలు వేశాయి.
చికిత్స తీసుకుంటున్న సమయంలో విచారణ పేరుతో రామోజీ ఇంటికి ఆఫీసర్లు వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఇంతా చేసి మార్గదర్శి నిజాయితే బయటపడే దిశగా పరిణామాలు వెళ్లాయి. ఈ ప్రస్తావనే రాజేంద్రప్రసాద్ తెచ్చారనుకోవాలి. వైసిపి పాలనలో తప్పులు నేరాలను ఎత్తిచూపించి ప్రజలు నిజాలు తెలుసుకునే దిశగా ఈనాడు చేసిన యజ్ఞం అసాధారణం.