భలే మంచి ఛాన్సు దొరికెరా

ఎల్లుండి విడుదల కాబోతున్న మనమే కోసం థియేటర్ వ్యవస్థ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మాస్ సినిమా కాకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనక సరిగ్గా కనెక్ట్ అయితే కనీసం రెండు వారాల పాటు మంచి వసూళ్లు చూడొచ్చనే ధీమాలో ఉన్నారు.

పైగా పోటీలో ఉన్న సత్యభామ, లవ్ మౌళి, రక్షణలు ఒక జానర్ కు కట్టుబడిన మూవీస్ కావడంతో అంత టెన్షన్ పడడానికి ఏం లేదు. సెన్సార్ పూర్తి చేసుకున్న మనమే నిడివి 2 గంటల 35 నిముషాలు. ఎన్నడూ లేనిది ఒక తెలుగు ఆల్బమ్ లో 16 పాటలు ఉండటం ఒక విశేషమైతే హేశం అబ్దుల్ వహాబ్ తన కెరీర్ బెస్ట్ గా వీటిని చెప్పడం అంచనాలు పెంచుతోంది.

ఎన్నికల ఫలితాల వేడి క్రమంగా తగ్గుతున్న తరుణంలో మనమే కనక ఆడియన్స్ పల్స్ ని పట్టుకోగలిగితే హౌస్ ఫుల్ బోర్డులు చూడొచ్చు. నిన్న వారం వచ్చిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి, భజే వాయు వేగం, గంగం గణేశాలు ఇప్పటికే నెమ్మదించాయి. వీకెండ్ లో కొంచెం పికప్ అయినా మరీ అనూహ్యంగా పెరుగుదల ఉండకపోవచ్చు.

కాబట్టి మనమేనే బాక్సాఫీస్ పరంగా ఫస్ట్ ఛాయస్ అవుతుంది. ఒకే ఒక జీవితం తర్వాత గ్యాప్ వచ్చిన శర్వానంద్ మళ్ళీ కనిపించలేదు. గ్యాప్ కావాలని తీసుకోకపోయినా అనుకోకుండా అలా వచ్చింది కాబట్టి మంచి కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాడు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యదీ అదే పరిస్థితి.

ఎలక్షన్లు, ఐపీఎల్ అయిపోయాయి. టి20 వరల్డ్ కప్ మొదలైనా దాని మీద జనాలకు అంతగా ఆసక్తి లేదని ట్రెండ్ సూచిస్తోంది. ఒకవేళ 9న ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ నుంచి ఏమైనా ఊపొస్తుందేమో చూడాలి. అప్పటిదాకా ఎంటర్ టైన్మెంట్ అంటే థియేటర్ మాత్రమే.

ఏపీలో అధికారం ఎవరిదో తేలిపోయింది కనక దాని గురించి పబ్లిక్ లో పెద్దగా చర్చలు ఉండవు. చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం తర్వాత మొత్తం కూల్ అయిపోతుంది. 14న హరోంహర, మ్యూజిక్ షాప్ మూర్తి, మహారాజా, ఇంద్రాణిలు వస్తున్నా కుటుంబ ప్రేక్షకులను మనమే మెప్పిస్తే చాలు మొదటివారంలోనే బ్రేక్ ఈవెన్ దాటేయొచ్చు .