ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం తెలుగు సినీ పరిశ్రమ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. రాజకీయాలతో సినిమా వాళ్లకు ఎప్పుడూ సంబంధాలు ఉన్నాయి, రాజకీయాల ప్రభావం సినిమాల మీదా పడుతుంటుంది.
కానీ గత ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో మాత్రం ఫిలిం ఇండస్ట్రీ ఏపీలో బాగా ఒడుదొడుకులు ఎదుర్కొంది. అందుకే ఆ ప్రభుత్వం పోయి కూటమి అధికారంలోకి రావాలనే ఆకాంక్ష మెజారిటీ సినీ జనాల్లో ఉంది. ప్రభుత్వం మారితే నిర్మాతలకు కచ్చితంగా మంచి రోజులు వచ్చినట్లే అని భావిస్తున్నారు.
ఏపీలో ఏర్పాటయ్యే ప్రభుత్వం ఆధారంగా బాగా ప్రభావితం అయ్యే తొలి చిత్రం.. కల్కినే. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో నిర్మించిన అశ్వినీదత్.. తెలుగుదేశం మద్దతుదారన్న సంగతి తెలిసిందే. వైకాపాతో ఆయనకు అస్సలు పడదు. ఓపెన్‌గా ఆ పార్టీని, జగన్ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. కూటమికి మద్దతు పలికారు.
ఈ నేపథ్యంలో ఒకవేళ జగన్ సర్కారు వస్తే.. కచ్చితంగా కల్కి సినిమాను టార్గెట్ చేస్తుందనడంలో సందేహం లేదు. ఏదో రకంగా అడ్డంకులు తప్పవు. ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు మామూలుగా ఇచ్చే అదనపు రేట్లు ఉండకపోవచ్చు.
వేరే రకమైన ఇబ్బందులు కూడా ఎదురు కావచ్చు. ఒకవేళ ప్రభుత్వం మారితే మాత్రం కల్కి పంట పండినట్లే. కోరుకున్న స్థాయిలో అదనపు రేట్లు వస్తాయి. అదనపు షోలకు ఇబ్బంది ఉండదు. అలాగే బెనిఫిట్ షోలు కూడా అందుబాటులోకి వస్తాయి.
ఇది ఆ సినిమా ఆదాయంలో గణనీయమైన పెరుగుదలకు దారి తీస్తుంది. అదే సమయంలో ప్రభుత్వం మారకుంటే డెంట్ కూడా గట్టిగానే పడుతుంది. అందుకే ఏపీ ఎన్నికల ఫలితాల కోసం కల్కి టీం మిగతా వాళ్ల కంటే ఎక్కువ ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ఐతే సర్వేలన్నీ చాలా వరకు కూటమికే పట్టం కట్టిన నేపథ్యంలో అశ్వినీదత్ అండ్ కో ధీమాతోనే ఉన్నారు.