ఒక్క సినిమా పై ఎంద‌రి ఆశ‌లో..

వేస‌వి ముగింపు ద‌శ‌లో టాలీవుడ్ బాక్సాఫీస్‌లో కొంత క‌ళ క‌నిపిస్తోంది. గ‌త వీకెండ్లో వ‌చ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. డ‌ల్లుగా మొద‌లైన భ‌జే వాయు వేగం త‌ర్వాత పుంజుకుని మంచి వ‌సూళ్లు సాధించింది.

మ‌ధ్య‌లో జ‌నం దృష్టి ఎగ్జిట్ పోల్స్, ఎన్నిక‌ల ఫ‌లితాల మీదికి మ‌ళ్లింది. మంగ‌ళ‌వారం ప‌లితాలు వ‌చ్చేశాక మ‌ళ్లీ వీకెండ్ వ‌చ్చేస‌రికి సినిమాల వైపు చూస్తార‌ని ఇండ‌స్ట్రీ ఆశ‌తో ఉంది.

ఇక బాక్సాఫీస్ మంచి ఊపుతో న‌డుస్తుంద‌ని భావిస్తున్నారు. ఈ వారాంతంలో మూడు సినిమాలు రిలీజ‌వుతున్నాయి. వాటిలో ఎక్కువగా ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షిస్తోంది మ‌న‌మే చిత్ర‌మే. ఈ సినిమా మీద హీరో హీరోయిన్ల‌తో పాటు ద‌ర్శ‌కుడు, నిర్మాత కూడా చాలా ఆశ‌లే పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్ కావ‌డం వాళ్లంద‌రికీ చాలా అవ‌స‌రం.

హీరో శ‌ర్వానంద్ చాలా ఏళ్ల నుంచి మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఒకే ఒక జీవితం మిన‌హా ఓ మోస్త‌రుగా ఆడిన సినిమా కూడా లేద‌త‌డికి. మంచి టాక్ తెచ్చుకోవ‌డంతో పాటు. క‌మ‌ర్షియ‌ల్‌గానూ బాగా ఆడే సినిమా కోసం అత‌ను ఎదురు చూస్తున్నాడు.

మ‌న‌మే అలాంటి సినిమానే అవుతుంద‌ని ఆశిస్తున్నాడు. ఇక ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్ చిత్రాల‌తో కెరీర్ ఆరంభంలో మంచి ఊపు మీద క‌నిపించిన హీరోయిన్ కృతి శెట్టి త‌ర్వాత వ‌రుస‌గా ప‌రాజ‌యాలు అందుకుంది. ఆమెకు కూడా హిట్ అత్యావ‌శ్య‌కం. ఇది తేడా కొడితే తెలుగులో కెరీర్ ముందుకు సాగ‌డం క‌ష్ట‌మే. మ‌రోవైపు ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య విష‌యానికి వ‌స్తే.. అత‌డి సినిమాలు కొంచెం ప్రామిసింగ్‌గానే క‌నిపిస్తాయి. కానీ అనుకున్నంత‌గా ఆడ‌వు. భ‌లే మంచి రోజు, శ‌మంత‌క‌మ‌ణి, దేవ‌దాసు, హీరో… ఇలా అత‌ను తీసిన సినిమాల‌న్నింటిదీ ఇదే వ‌ర‌స‌.

అత‌ను కూడా ఇప్పుడు హిట్ కొట్టి తీరాల్సిన స్థితిలో ఉన్నాడు. ఇక తెలుగులో ఇంకే సంస్థ‌కూ సాధ్యం కాని రీతిలో ప‌దుల సంఖ్య‌లో సినిమాలు నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా సంస్థ‌కు కూడా మంచి హిట్ ద‌క్క‌ట్లేదు. బ్రో, ఈగ‌ల్.. ఇలా పెద్ద సినిమాలు నిరాశ‌ప‌రిచాయి. ఈ నేప‌థ్యంలో వీళ్లంద‌రికీ మ‌న‌మే ఓ మంచి విజ‌యాన్నందిస్తుందేమో చూడాలి.